రక్తదానం చేయడం మంచిదేనా? ఏడాదికి ఎన్నిసార్లు చెయ్యొచ్చు.. | World Blood Donor Day 2024: Is It Healthy To Donate Blood? | Sakshi
Sakshi News home page

రక్తదానం చేయడం మంచిదేనా? ఏడాదికి ఎన్నిసార్లు చెయ్యొచ్చు..

Published Fri, Jun 14 2024 11:11 AM | Last Updated on Fri, Jun 14 2024 11:28 AM

World Blood Donor Day 2024: Is It Healthy To Donate Blood?

చంద్రమండలంలో అడుగుపెట్టే మేధా శక్తి ఉన్న మనిషి సృష్టించలేనిది.. అరచేతిలోనే ప్రపంచాన్ని అందిపుచ్చుకునే సాంకేతికత ఉన్నా కూడా తయారు చేయలేని పదార్థం. ఎన్ని కొంగొత్త ఆవిష్కరణలు చేసినా.. కృత్రిమంగా తయారు చేయడానికి వీలుపడనిది...'రక్తం'. నిరంతరం వ్యాధులతో పోరాడే వారికి..రోడ్డు ప్రమాదానికి గురైన క్షతగాత్రులకు అత్యవసరమైనది.. 'రక్తమే'. ఈ నేపథ్యంలోనే రక్తదానాన్ని ప్రోత్సహించడం కీలకమన్న విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించి ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ఏటా జూన్‌ 14న నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా రక్తదానంపై ఉన్న అపోహలు, సురక్షితమైన రక్తానికి ఉన్న డిమాండ్‌ గురించి సవివరంగా తెలుసుకుందాం.

ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ప్రతి ఏడాది జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా ప్రజలు జరుపుకుంటారు. జూన్ 14నే ఎందుకంటే.. నోబెల్‌ గ్రహిత శాస్త్రవేత్త కార్ల్ ల్యాండ్‌స్టైనర్ పుట్టినరోజున జరుపుకుంటున్నాం. ఆయన ఏబీఓ బ్లడ్‌ గ్రూప్‌ కనుగొన్నందువల్లే రక్తమార్పిడి గురించి ప్రపంచానికి తెలిసింది. అందువల్లే కార్ల్‌ ల్యాండ్‌స్టైనర్‌ గౌరవార్థం ఇలా ఆయన జయంతి రోజున రక్తదాతల దినోత్సవం పేరుతో రక్త దానం గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.

ఈ రోజున మనమిచ్చే రక్తంతో ఎన్ని ప్రాణాలు నిలబడతాయో శిబిరాలు నిర్వహించి మరీ తెలియజేస్తారు అధికారులు. అయితే చాలామందిలో రక్తదానం విషయంలో చాలా అపోహలు ఉన్నాయి. మనం గనుక ఇప్పుడు దానం చేస్తే ఏమైనా.. అనారోగ్య సమస్యలు వస్తాయని భయపడతారు. ఒక్కసారి రక్తదానం చేశాక మళ్లీ తొందరగా కోలుకుంటామా అనే భయం కూడా ఉంటుంది చాలమందిలో. అయితే వైద్యులు అవన్నీ అపోహలే అని కొట్టిపారేస్తున్నారు. పైగా రక్తదానం చేయడం వల్ల మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటామని చెబుతున్నారు. 

రక్తదానం వల్ల కలిగే ప్రయోజనాలు..

  • రక్తదానం చేసిన 48 గంటల్లోనే ఒక వ్యక్తి రక్త పరిమాణం సాధారణ స్థితికి వస్తుందని చెబుతున్నారు వైద్యులు. 

  • వృద్ధులు అర్హత ప్రమాణాలకు అనుగుణంగా రక్తదానం చేయవచ్చని చెబుతున్నారు

  • మందులు వాడుతున్నావారు కూడా రక్తదానం చెయ్యొచని చెబుతున్నారు. రక్తదానం కేంద్రంలో వారే వాడే మందులు, ఆరోగ్య చరిత్ర ఆధారంగా నిర్ణయిస్తారు. కొన్ని సమయాల్లో కొన్ని రోజుల పాటు ఆయా మందులను నిరోధించమని చెప్పి..తర్వాత దాత నుంచి రక్తాన్ని తీసుకుంటారని వైద్యులు చెబుతున్నారు.
    అలాగే రక్తదానం చేసే ప్రక్రియ సాధారణంగా 15 నిమిషాలకు మించి సమయం పట్టదు. 

  • జీవితాలను నిలబట్టే మహత్తర కార్యం ఇది అని చెబుతున్నారు. రక్తదానం చేస్తే ఇన్ఫెక్షన్‌ల బారిన పడతాం అనుకుంటారు. ఇది కూడా అపోహ అని తేల్చి చెబుతున్నారు వైద్యులు. ఎందుకంటే రక్తదాన కేంద్రాలు అంటువ్యాధులను నివారించడానికి కఠినమైన భద్రతా ప్రోటాకాల్‌లను పాటిస్తాయి. పైగా దానం చేసిన రక్తాన్ని ఉపయోగించే ముందు అంటువ్యాధుల కోసం క్షణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. 

  • ఇది నొప్పి లేకుండా దాతనుంచి సునాయాసంగా చిన్న పాటి సుదితో రక్తాన్ని తీసుకోవడం జరుగుతుంది. దానం చేసే వ్యక్తి, వయసు, ఆరోగ్య చరిత్ర ఆధారంగా ఏడాదికి చాలాసార్లు రక్తదానం చెయ్యొచ్చని చెబుతున్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న వ్యక్తి 2 నెలలు లేదా 56 రోజులకు ఒకసారి రక్తదానం చేయొచ్చు
     

సురక్షితమైన రక్తానికి ఉన్న డిమాండ్‌..

  • భారతదేశంలోని ఆస్పత్రుల్లో దాదాపు 14.6 మిలియన్ల యూనిట్ల రక్తం డిమాండ్‌ ఉన్నట్లు అంచనా వేశాయి. అయితే ఈ డిమాండ్‌ తగ్గట్టు కేవలం 96% మాత్రమే రక్తం అందుబాటులో ఉందని, దాదాపు ఒక మిలియన్‌ యూనిట్‌ వరకు చాలా సెంటర్లలో కొరత ఉందని పేర్కొంది నివేదిక. అందువల్లే స్వచ్ఛందంగా రక్తం దానం చేసేందుకు ముందుకు వచ్చేలా ప్రజల్లో చైత్యం తీసుకువచ్చేలా అవగాహన కార్యక్రమాలు వంటివి ముమ్మరంగా చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు నిపుణులు. 

  • ప్రపంచవ్యాప్తంగా చూస్తే రక్తం కోసం డిమాండ్ చాలా ఎక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. 2017లోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు 30 మిలియన్ల యూనిట్ల రక్తం కొరతను ఉందని, ఏకంగా 119 దేశాల్లో బ్లడ్‌ సెంటర్లలో రక్తం అందుబాటుల్లో లేదని వెల్లడించాయి నివేదికలు.

  • దీన్ని పరిష్కరించేందుకు స్వచ్ఛంద రక్తదానాన్ని ప్రోత్సహించాలి. రక్త నిర్వహణ పద్ధతులను మెరుగుపరచాలి, రక్తమార్పిడి వ్యవస్థలను బలోపేతం చేయాలి. 
     

రక్త మార్పిడి ఎలాంటప్పుడంటే..

  • ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు, వైద్యపరమైన అత్యవసర పరిస్థితులకు తక్షణమే రక్తం అవసరం. సురక్షితమైన రక్తం అందుబాటుల్లో ఉండే ప్రాణాలను రక్షించగలుగుతాం. 

  • వైద్య విధానాలు: శస్త్ర చికిత్సలు, కేన్సర్‌ చికిత్సలు, అవయవ మార్పిడి, ప్రసవం తదితర వాటికి రక్తమార్పిడి అవసరం అవుతుంది. 

  • తలసేమియా, సికిల్‌ సెల్‌ వ్యాధి, హిమోఫిలియా వంటి పరిస్థితుల్లో బాధపడుఉన్న రోగులకు వారి ఆరోగ్యాన్ని నిర్వహించడానికి క్రమం తప్పకుండా రక్తమార్పిడి అవసరం. 

  • రక్తహీనత: ఐరన్‌ లోపం లేదా ఇతర కారణాల వచ్చే రక్తహీనత, ఆరోగ్యకరమైన హిమోగ్లోబిన్‌ స్థాయిలను పునరుద్ధరించడానికి రక్తమార్పిడి అవసరం

  • బ్లడ్‌ డిజార్డర్స్‌: లుకేమియా, లింఫోమా, రక్త సంబంధిత రుగ్మతల చికిత్స కోసం రక్తమార్పిడి కీలకం. 

  • ప్రసూతి మరణలను నివారించడానికి, గర్భధారణ, ప్రసవ సమయంలో సురక్షితమై రక్త మార్పిడి చాలా కీలకం.

తదితర వాటిలో సురక్షితమైన రక్తం అవసరమవుతుంది. అందువల్ల ఈ దినోత్సవం రోజున ప్రజలు స్వచ్ఛందంగా రక్తం దానం చేసేందుకు ముందుకు వచ్చేలా చేస్తే సురక్షితమైన రక్తం కొరతను నివారించగలుగుతాం. ఎన్నో ప్రాణాలను కాపాడిన వాళ్లం అవుతాం. అంతేగాదు రక్తం ఇవ్వడం అంటే ప్రాణం ఇచ్చినట్లే అని అందరూ గ్రహించాలి. ఈ మహాత్తర నిస్వార్థ కార్యక్రమంలో మనమందరం పాలుపంచుకుని ఈ సమస్యను నివారిద్దాం.

(చదవండి: రక్తం కాదు.. ప్రాణం ఇచ్చినట్టే!)

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement