వాణిజ్యం ఎంతో సులభం
గాంధీనగర్: సుస్థిరమైన పన్ను విధానం, పారదర్శకమైన, న్యాయబద్ధమైన విధాన వాతావరణం కల్పించడం ద్వారా.. ప్రపంచ సమాజం వాణిజ్యం చేయడానికి భారతదేశాన్ని అత్యంత సులువైన ప్రదేశంగా తీర్చిదిద్దుతామని ప్రధాని నరేంద్రమోదీ హామీ ఇచ్చారు. అన్ని రంగాలు, ప్రాంతాలను అపరిమితంగా అభివృద్ధి చేస్తామని కూడా మాట ఇచ్చారు. రెండేళ్లకు ఒకసారి జరిగే వైబ్రంట్ గుజరాత్ శిఖరాగ్ర సదస్సు ఆదివారమిక్కడ ప్రారంభమైంది. మూడు రోజుల సదస్సులో తొలిరోజు.. గుజరాత్‌లో వివిధ రంగాల్లో భారీ పెట్టుబడులపై వివిధ దేశీయ, విదేశీ కంపెనీలు 31 అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
ఏడోసారి జరుగుతున్న ఈ శిఖరాగ్ర సదస్సును మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అమెరికా విదేశాంగ మంత్రి జాన్‌కెర్రీ, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కి మూన్‌లతో పాటు అంతర్జాతీయ, దేశీయ సంస్థల సీఈఓలు హాజరయ్యారు. మోదీ ప్రసంగిస్తూ.. ‘‘నిరాశ, అస్థిరత వాతావరణం ఏడు నెలల కాలంలోనే వెళ్లిపోయాయి. మీకు ఎప్పుడవసరమైనా ప్రభుత్వం చేయూతనిస్తుంది. మీరు ఓ అడుగు ముందుకు వేస్తే.. మీ కోసం మా ప్రభుత్వం రెండడుగులు వేస్తుంది’’ అని అన్నారు. భారతదేశం రూపాంతరం చెందుతోందని, విధాన చోదక పాలనను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. అభివృద్ధిని పెంపొందించేందుకు, ఉద్యోగసృష్టిని ప్రోత్సహించేందుకు తయారీపరిశ్రమకు ఊతమివ్వాలని అన్నారు. దీనికోసం ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చేందుకు కేంద్ర, రాష్ట్రాల స్థాయిల్లో సింగిల్ విండో విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు.
వేగవంతమైన, సమీకృత అభివృద్ధికి కృషి
గత ఐదేళ్లలో ఆర్థికాభివృద్ధి మందగించిందని.. ఇప్పుడు తన ప్రభుత్వం వేగవంతమైన, సమీకృతమైన అభివృద్ధిని సాధించేందుకు శాయశక్తులా కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఆర్థిక సంస్కరణల చక్రాన్ని వేగంగా పూర్తిచేయటానికి కట్టుబడి ఉన్నామన్నారు. ప్రభుత్వ - ప్రయివేటు పెట్టుబడుల ద్వారా ప్రధానంగా.. రహదారులు, గ్యాస్ గ్రిడ్లు, విద్యుత్, నీటి వ్యవస్థలు, సాగునీటి పారుదల, నదుల ప్రక్షాళన వంటి మౌలిక సదుపాయాల నిర్మాణంపై దృష్టి కేంద్రీకరించామని వివరించారు. ప్రాథమిక ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికాల్లో వృద్ధి రేటు గత ఏడాది వృద్ధి రేటుకన్నా ఒక్క శాతం పెరిగిందని చెప్పారు. రాబోయే సంవత్సరాల్లో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న రెండోదేశంగా ఉంటుందని ఐఎంఎఫ్ జోస్యం చెప్పిందని ఉటంకించారు.
గాంధీ చూపిన మార్గంలో నడవాలి...
మహాత్మా గాంధీ సూచించిన మార్గంలో నడవాలని మోదీ పిలుపునిచ్చారు. ‘‘చిట్టచివరి మనిషి గురించి మహాత్మా గాంధీ సరిగ్గా చెప్పారు. గాంధీజీ సందేశం మనకు మార్గాన్ని చూపగలదు. ఈ కార్యక్రమం ఇచ్చే ఉత్తమ ఫలితం.. మనం శ్రద్ధ పెట్టాల్సిన, అభివృద్ధి చేయాల్సిన ప్రజా సమూహాలను చేర్చుకోవటం, వారికి స్థానమివ్వటం కావాలి’’ అని పేర్కొన్నారు. సదస్సులో రక్షణ మంత్రి మనోహర్ పారికర్ మాట్లాడుతూ.. రక్షణ రంగ తయారీ, కొనుగోళ్లకు సంబంధించి రెండు మూడు నెలల్లో పారిశ్రామిక అనుకూలమైన విధానాన్ని ప్రకటించనున్నట్లు తెలిపారు.
ఉగ్ర నిరోధంలో సహకారంపై చర్చలు
ఉగ్రవాద వ్యతిరేక సహకారం, మరింతగా ఆర్థిక సంబంధాలు తదితర అంశాలపై ప్రధాని మోదీ ఆదివారం నాడు అమెరికా, కెనడా దేశాల సీనియర్ నాయకులతో చర్చించారు. వైబ్రంట్ గుజరాత్ సదస్సుకు హాజరైన అమెరికా విదేశాంగ మంత్రి జాన్‌కెర్రీతో సమావేశమైన మోదీ.. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా త్వరలో చేపట్టనున్న భారత పర్యటన అంశంపై ప్రధానంగా చర్చించారు. ఉగ్రవాద వ్యతిరేక సహకారం, ఆర్థిక అంశాలు, ప్రాంతీయ అంశాలు కూడా ఈ భేటీలో చర్చకు వచ్చాయని పీఎంఓ ఒక ప్రకటనలో తెలిపింది.
కెనడా పౌరసత్వ, వలస విభాగం మంత్రి క్రిస్ అలెగ్జాండర్‌తో కూడా మోదీ భేటీ అయ్యారు. ఈ సమావేశంలోనూ ఉగ్రవాద వ్యతిరేక సహకారం కీలకాంశంగా చర్చకు వచ్చింది. కెనడా పార్లమెంటుపై ఉగ్రవాదుల దాడిని మోదీ ఖండించారు. ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించరాదని ఉద్ఘాటించారు. అలాగే.. తాను కెనడా పర్యటనకు వెళ్లే అంశంపైనా మోదీ చర్చించారు.
ఇజ్రాయెల్ వ్యవసాయ మంత్రి యాయిర్ షమీర్‌తోనూ మోదీ సమావేశమయ్యారు. వ్యవసాయ రంగంలో ఆ దేశం నుంచి మరింత సహకారం అందించాలని కోరారు.
ఇరాన్ అధ్యక్షుడికి సీనియర్ సలహాదారుడైన అక్బర్ టోర్కాన్‌తోనూ మోదీ భేటీ అయ్యారు. ఈ భేటీలో చాబాహార్ పోర్ట్ ప్రాజెక్టు అమలు ప్రగతిపై సమీక్షించారు.
ఐరాససెక్రటరీ జనరల్ బాన్ కి-మూన్, ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు జియ్‌యాంగ్‌కిమ్‌లతో వేర్వేరుగా భేటీ అయిన మోదీ.. వాతావరణ మార్పులు, కాలుష్య రహిత ఇంధనశక్తి అంశాలపై చర్చించారు.
మాసిడోనియా ప్రధానమంత్రితో మోదీ భేటీలో.. వాణిజ్య, పెట్టుబడుల సంబంధాలను పెంపొందించుకోవాలని ఇరుపక్షాలూ అంగీకరించాయి.
రష్యాలోని ఆస్ట్రాకాన్ గవర్నర్ ల్‌కిన్‌తో భేటీ సందర్భంగా.. భారత్ తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.
అన్ని రంగాలు, ప్రాంతాలను అపరిమితంగా అభివృద్ధి చేస్తాం