vibrant gujarat
-
గుజరాత్ సమ్మిట్‌లో కనిపించని 'ఇలాన్ మస్క్'.. టెస్లా ఫ్యూచర్ ఏంటి?
భారతదేశంలో టెస్లా అరంగేట్రం చేయడానికి గత కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తూనే ఉంది. ప్రయత్నాలన్నీ సఫలీకృతమై గుజరాత్ రాష్ట్రంలో కంపెనీ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి సిద్దమైనట్లు వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అయితే ఇటీవల ప్రారంభమైన 'వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్ 2024' (2024 Vibrant Gujarat Global Summit)కు మాత్రం 'మస్క్' హాజరు కాలేదు. నిజానికి వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్ 2024 వేదికగా టెస్లా చర్చలు జరగనున్నట్లు జరుగుతాయని చాలామంది భావించారు, కానీ టెస్లా అధినేత ఈ సమావేశానికి హాజరు కాలేదు. దీనిపై స్పందించిన గుజరాత్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ 'రాహుల్ గుప్తా' మస్క్ ఈ సమ్మిట్‌కు హాజరు కానప్పటికీ పెట్టుబడులు పెట్టడానికి స్వాగతం రాష్ట్రం పలుకుతోందని స్పష్టం చేశారు. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని అమెరికన్ కంపెనీ కూడా ఇండియాలో ఓ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి సన్నద్ధమైంది. దీనికోసం కంపెనీ గుజరాత్‌ను మొదటి ఎంపిక చేసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్లాంట్ ఏర్పాటుకు అనువైన స్థలం గుజరాత్ అని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. ఇదీ చదవండి: వెనుకపడ్డ యాపిల్.. వ్యాల్యుబుల్ కంపెనీగా మైక్రోసాఫ్ట్ ఎలోన్ మస్క్ 2024లో భారతదేశంలో టెస్లా వ్యాపారాన్ని విస్తరించనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. త్వరలో గుజరాత్లో ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు టెస్లా కేంద్రంతో సంప్రదింపులు జరుపుతోందని. 2023లోనే యునైటెడ్ స్టేట్స్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మస్క్ సమావేశమై టెస్లా ఫ్యాక్టరీ గురించి చర్చలు జరిపారు. మొత్తం మీద మస్క్ టెస్లా ఫ్యాక్టరీని ఈ ఏడాది భారత్‌కు వచ్చే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతోంది. -
Vibrant Gujarat: తొలిరోజే రూ.2.35 లక్షల కోట్లు!
గాంధీనగర్: గత రెండు దశాబ్దాలుగా వైబ్రంట్ గుజరాత్ సదస్సు అంతర్జాతీయ బిజినెస్ నెట్వర్కింగ్ ఈవెంట్‌గా ఆవిర్భవించింది. తద్వారా కార్పొరేట్ ప్రపంచం నుంచి భారీ పెట్టుబడులను ఆకట్టుకుంటోంది. తాజాగా 10వ వైబ్రంట్ గుజరాత్(2024) సదస్సులో రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేశ్ అంబానీ, అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీ, సుజుకీ మోటార్ కార్ప్ ప్రెసిడెంట్ తోషిహిరో సుజుకీ, టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ తదితరులు పెట్టుబడులకు ఆసక్తిని ప్రదర్శించారు. వెరసి తొలి రోజే రూ. 2.35 లక్షల కోట్ల పెట్టుబడి ప్రణాళికలను ప్రకటించారు. దేశ, విదేశీ దిగ్గజాల నుంచి భారీ పెట్టుబడులను ఆకట్టుకుంటున్న రాష్ట్రాలలో గుజరాత్ ఒకటిగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. వివరాలు చూద్దాం.. రిలయన్స్.. కార్బన్ ఫైబర్ ప్లాంట్ హజీరాలో దేశంలోనే తొలి కార్బన్ ఫైబర్ ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ చీఫ్ ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. గుజరాత్ కేంద్రంగా రిలయన్స్ కార్యకలాపాలు కొనసాగనున్నట్లు తెలియజేశారు. గత దశాబ్ద కాలంలో ప్రపంచస్థాయి ఆస్తులు, సామర్థ్యాలను అభివృద్ధి చేయడంలో దేశవ్యాప్తంగా 150 బిలియన్ డాలర్లు(రూ. 12 లక్షల కోట్లు) వెచ్చించినట్లు వివరించారు. వీటిలో మూడో వంతు పెట్టుబడులను గుజరాత్‌లోనే చేపట్టినట్లు తెలియజేశారు. తద్వారా ఈ ప్రాంతానికి తామిస్తున్న ప్రాధాన్యతను ప్రస్తావించారు. టాటా.. సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ఈ ఏడాది(2024) చివరిలో నూతన సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంటును గుజరాత్లో ఏర్పాటు చేయనున్నట్లు టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. దేశీయంగా చిప్స్ తయారీకి ప్రధాని మోడీ ఇస్తున్న ప్రాధాన్యతకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. అంతేకాకుండా ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్ సాణంద్‌లో లిథియమ్ అయాన్ బ్యాటరీల తయారీ కేంద్రానికి తెరతీయనున్నట్లు వెల్లడించారు. ప్రాథమిక దశలో 20 గిగావాట్ స్టోరేజీ బ్యాటరీ సామర్థ్యంతో తయారీ ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. ఎలక్ట్రిక్ వాహనా (ఈవీ)లకు పెరుగుతున్న డిమాండుకు అనుగుణంగా పెట్టుబడులు చేపట్టనున్నట్లు వివరించారు. రెండు దశలలో చేపట్టనున్న ప్రాజెక్ట్ పనులు రెండు నెలల్లోగా ప్రారంభంకానున్నట్లు తెలియజేశారు. ఆర్సెలర్‌మిట్టల్.. అతిపెద్ద స్టీల్‌ప్లాంట్ ప్రపంచంలోనే ఒకే ప్రాంతంలో అతిపెద్ద స్టీల్ ఫ్యాక్టరీని హజీరాలో ఏర్పాటు చేయనున్నట్లు ఆర్సెలర్‌మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్ పేర్కొన్నారు. జేవీ ఆర్సెలర్‌మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా ద్వారా 2029కల్లా ప్లాంటు నిర్మాణం పూర్తికాగలదని తెలియజేశారు. ప్లాంటును వార్షికంగా 2.4 కోట్ల టన్నుల స్టీల్ తయారీ సామర్థ్యంతో నెలకొల్పనున్నట్లు వెల్లడించారు. 2026లో తొలి దశ ప్రారంభంకావచ్చని తెలియజేశారు. మైక్రాన్.. రూ. 6,760 కోట్లు సెమీకండక్టర్ల తయారీలో భారత్‌ను అంతర్జాతీయ కేంద్రంగా నిలపాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలను మైక్రాన్ టెక్నాలజీ సీఈవో సంజయ్ మెహ్రోత్రా ప్రశంసించారు. ఈ యూఎస్ చిప్ తయారీ దిగ్గజం సాణంద్‌లో 2.75 బిలియన్ డాలర్ల సెమీకండక్టర్ టెస్టింగ్, ప్యాకేజింగ్ ప్లాంటు నిర్మాణాన్ని సెప్టెంబర్‌లోనే ప్రారంభించింది. పెట్టుబడుల్లో మైక్రాన్ 82.5 కోట్ల డాలర్లు (సుమారు రూ. 6,760 కోట్లు) ఇన్వెస్ట్ చేయనుంది. మిగిలిన నిధులను ప్రభుత్వం రెండు దశలలో సబ్సిడీ రూపంలో సమకూర్చనుంది. -
Vibrant Gujarat Global Summit 2024: విశ్వమిత్ర భారత్
గాందీనగర్: ప్రపంచవ్యాప్తంగా అనిశి్చత పరిస్థితులు కొనసాగుతున్న తరుణంలో భారత్ నూతన ఆశారేఖగా ఆవిర్భవించిందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ప్రపంచ దేశాలు భారత్‌ను స్థిరత్వానికి ఒక ముఖ్యమైన మూలస్తంభంగా, నమ్మకమైన మిత్రదేశంగా, భాగస్వామిగా, గ్లోబల్ ఎకానమీలో గ్రోత్ ఇంజన్‌గా, గ్లోబల్ సౌత్ దేశాల గొంతుకగా, టెక్నాలజీ హబ్‌గా, ప్రజాస్వామ్యసౌధంగా పరిగణిస్తున్నాయన్నారు. మారుతున్న ప్రపంచ క్రమంలో విశ్వమిత్రగా భారత్ అవతరిస్తోందన్నారు. గాం«దీనగర్‌లో బుధవారం పదో ‘వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సదస్సు’ ప్రారం¿ోత్సవంలో మోదీ ప్రసంగించారు. త్వరలో భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం ఖాయమని రేటింగ్ ఏజెన్సీలన్నీ చెబుతున్నాయని గుర్తుచేశారు. ఉమ్మడి లక్ష్యాలను నిర్దేశించడంతోపాటు వాటిని సాధించగలమన్న విశ్వాసాన్ని ప్రపంచానికి భారత్ ఇస్తోందన్నారు. పదేళ్లలో నిర్మాణాత్మక సంస్కరణలు ప్రపంచ అభివృద్ధికి, శ్రేయస్సుకు 140 కోట్ల మంది భారతీయులు ప్రాధాన్యతలు, ఆకాంక్షలు ఒక ఆధారంగా నిలుస్తున్నాయని ప్రధానమంత్రి మోదీ పేర్కొన్నారు. ఇండియా ప్రాధాన్యతలు చాలా స్పష్టంగా ఉన్నాయని చెప్పారు. స్థిరమైన పారిశ్రామికాభివృద్ధి, ఆధునిక మౌలిక వసతులు, నూతన తయారీ రంగం, కొత్తతరం నైపుణ్యాలు, భవిష్యత్తు టెక్నాలజీ, కృత్రిమ మేధ, నవీన ఆవిష్కరణలు, గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధన వనరులు, సెమీ కండక్టర్ల తయారీకి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. ప్రస్తుత ప్రపంచ పరిణామాల నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ ప్రగతికి అద్భుత అవకాశాలు ఉన్నాయని వివరించారు. గత పదేళ్లలో నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టామని, మన ఆర్థిక వ్యవస్థకు ఈ సంస్కరణలే చోదకశక్తిగా మారుతున్నాయని వెల్లడించారు. కొన్ని నెలల క్రితమే 75వ స్వాతంత్య్ర దినోత్సవాలు ఘనంగా నిర్వహించుకున్నామని, 25 ఏళ్ల తర్వాత 100వ స్వాతంత్య్ర దినోత్సవాలు జరుపుకోబోతున్నాయని చెప్పారు. రాబోయే 25 సంవత్సరాలు మనకు అమృత కాలమని ఉద్ఘాటించారు. ‘అభివృద్ధి చెందిన భారత్’ అనే లక్ష్యాన్ని ఈ అమృత కాలంలో సాధించుకోవాలని ప్రజలను పిలుపునిచ్చారు. విదేశీ పెట్టుబడులకు వెల్కం మనందరి ఉమ్మడి కృషి వల్ల 21వ శతాబ్దంలో ఇండియాకు ఉజ్వలమైన భవిష్యత్తు లభించబోతోందని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. గత ఏడాది జీ20 కూటమికి భారత్ సారథ్యం వహించిందని, ప్రపంచ భవిష్యత్తు కోసం ఒక రోడ్‌మ్యాప్‌ను అందించిందని తెలియజేశారు. ఐ2యూ2(ఇండియా, ఇజ్రాయెల్, యూఏఈ, యూఎస్ఏ) గ్రూప్‌తోపాటు ఇతర బహుముఖీన సంస్థలతో సంబంధాలను నిరంతరం బలోపేతం చేసుకుంటున్నామని చెప్పారు. టెక్నాలజీని సమర్థవంతంగా వాడుకుంటూ దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేశామని, 40 వేలకుపైగా కాలం చెల్లిన నిబంధనలను సులభతర వాణిజ్య విధానం, జీఎస్టీ కింద రద్దు చేశామని తెలిపారు. పెట్టుబడులను ఆకర్శించడానికి, గ్లోబల్ బిజినెస్‌కు ఇండియాను గమ్యస్థానంగా మార్చడానికి మూడు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై(ఎఫ్‌టీఏ) సంతకాలు చేశామని ప్రధాని మోదీ చెప్పారు. పలు కీలక రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహా్వనిస్తున్నామని అన్నా రు. దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పన కోసం రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెట్టామని వివరించారు. గత పదేళ్లలో పెట్టుబడి వ్యయాన్ని 10 రెట్లు పెంచామన్నారు. టెక్నాలజీతో జీవితాల్లో మార్పు గ్రీన్ ఎనర్జీ, పునరుత్పాదక ఇంధన రంగాల్లో భారత్ శరవేగంగా అభివృద్ధి సాధిస్తోందని మోదీ హర్షం వ్యక్తం చేశారు. గ్రీన్ ఎనర్జీలో మూడు రెట్లు, సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో 20 రెట్లు ప్రగతి నమోదైందని తెలిపారు. గత పదేళ్లలో చౌక ధరకే ఫోన్లు, డేటా వంటివి దేశంలో సరికొత్త డిజిటల్ విప్లవాన్ని తీసుకొచ్చాయని అన్నారు. ప్రతి గ్రామానికీ ఆప్టికల్ ఫైబర్, 5జీ టెక్నాలజీ రాకతో సామాన్య ప్రజల జీవితాల్లో మార్పు వచి్చందని చెప్పారు. 2028కల్లా భారత్ 5 ట్రిలియన్ డాలర్ల జీడీపీతో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం ఖాయమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. 2047 నాటికి సంపన్న దేశంగా మారుతుందన్నారు. -
అహ్మదాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ..
రెండు రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం రాత్రి అహ్మదాబాద్ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్ స్వాగతం పలికారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్‌తో పాటు ఇతర కార్యక్రమాలలో పాల్గొంటారు. అహ్మదాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ ఒక ట్వీట్ చేశారు. తాను ఈ రెండు రోజులు వైబ్రంట్ గుజరాత్ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నానని, ఈ శిఖరాగ్ర సదస్సులో పలువురు ప్రపంచ నేతలు పాల్గొనడం సంతోషకరమని అన్నారు. తన సోదరుడు మహమ్మద్ బిన్ జాయెద్ రాక ప్రత్యేకమైనదని, వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్‌తో తనకు మంచి అనుబంధం ఉందని అన్నారు. ఈ వేదిక గుజరాత్ అభివృద్ధికి ఎంతో దోహదపడింది. దీని ద్వారా చాలా మందికి అవకాశాలను సృష్టించినందుకు సంతోషిస్తున్నానని ప్రధాని పేర్కొన్నారు. ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ నేతలతో సమావేశమవుతారని విదేశాంగ మంత్రి అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ రెండు రోజుల పర్యటనలో ప్రధాన గ్లోబల్ కార్పొరేషన్ల సీఈవోలతో ప్రధాని భేటీ కానున్నారు. ప్రధాని మోదీ ‘గిఫ్ట్ సిటీ’ని సందర్శించనున్నారు. గ్లోబల్ ఫిన్‌టెక్ లీడర్షిప్ ఫోరమ్‌లో వ్యాపార ప్రముఖులతో భేటీ కానున్నారు. వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 10వ ఎడిషన్ గాంధీనగర్‌లో 2024, జనవరి 10 నుండి 12 వరకు జరగనున్నదని ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) తెలియజేసింది. ఈ కార్యక్రమం థీమ్ ‘గేట్‌వే టు ది ఫ్యూచర్’. దీనిలో 34 భాగస్వామ్య దేశాలు, 16 భాగస్వామ్య సంస్థలు పాల్గొననున్నాయి. మీడియాకు అందిన సమాచారం ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 9న ఉదయం 9:30 గంటలకు గాంధీనగర్‌లోని మహాత్మా మందిరానికి చేరుకుంటారు. అక్కడ ప్రపంచ నాయకులతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహిస్తారు. దీని తర్వాత గ్లోబల్ టాప్ కంపెనీల సీఈవోలతో సమావేశమవుతారు. Landed in Ahmedabad a short while ago. Over the next two days, will be taking part in the Vibrant Gujarat Summit and related programmes. It is a matter of immense joy that various world leaders will be joining us during this Summit. The coming of my brother, HH @MohamedBinZayed… pic.twitter.com/Ygaajg4TfM — Narendra Modi (@narendramodi) January 8, 2024 -
హాజీరా స్టీల్ ప్లాంటు పనులు వేగవంతం
అహ్మదాబాద్: హాజీరా ఉక్కు ప్లాంటు విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఆర్సెలర్‌మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీనివాస్ మిట్టల్ తెలిపారు. ఇది 2026 నాటికల్లా అందుబాటులోకి రాగలదని ’వైబ్రెంట్ గుజరాత్’ సదస్సు 20 ఏళ్ల వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్టులో దాదాపు 20,000 మంది పైచిలుకు వర్కర్లు పాలుపంచుకుంటున్నారని మిట్టల్ చెప్పారు. ఆర్సెలర్‌మిట్టల్‌లో భాగమైన ఏఎంఎన్ఎస్ ఇండియా గతేడాది అక్టోబర్‌లో హాజీరా ప్లాంటు సామరŠాధ్యలను 15 మిలియన్ టన్నులకు పెంచుకునేందుకు రూ. 60,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు, తొలి దశలో ఉత్పత్తిని రెట్టింపు చేయాలని, ఆ తర్వాత మూడింతలు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు మిట్టల్ చెప్పారు. భారత్ దిగుమతులను తగ్గించుకుని, స్వావలంబన సాధించేందుకు ఇది ఉపయోగపడగలదని ఆయన పేర్కొన్నారు. జీ20 సదస్సు విజయవంతం కావడం భారత్ ఖ్యాతిని మరింతగా ఇనుమడింపచేసిందని మిట్టల్ చెప్పారు. అటు, గుజరాత్లో సామాజిక–ఆర్థిక అభివృద్ధికి, పెట్టుబడుల రాకకు ఇన్వెస్టర్ల సదస్సు ఎంతగానో ఉపయోగపడుతోందని వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా వెల్స్పన్ సంస్థ చైర్మన్ బీకే గోయెంకా తెలిపారు. సెమీకండక్టర్ ఎలక్ట్రానిక్స్‌పై కసరత్తు చేసేందుకు జపానీస్ వ్యాపార బృందాన్ని నవంబర్‌లో ఆహా్వనించే యోచనలో ఉన్నట్లు జపాన్ ఎక్స్టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ తకాషి సుజుకీ తెలిపారు. తదుపరి వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సదస్సు వచ్చే ఏడాది జనవరి 10–12 మధ్య గాంధీనగర్‌లో నిర్వహించనున్నారు. -
Vibrant Gujarat Summit: త్వరలో ప్రపంచ ఆర్థిక శక్తి కేంద్రంగా భారత్
అహ్మదాబాద్/బొడేలీ: భారత్‌ను ప్రపంచ గ్రోత్ ఇంజన్‌గా మార్చాలన్నదే తన లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. మన దేశం త్వరలోనే ప్రపంచ ఆర్థిక శక్తి కేంద్రంగా అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ‘వైబ్రంట్ గుజరాత్’ తొలి శిఖరాగ్ర సదస్సుకు 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. 20 సంవత్సరాల క్రితం వైబ్రంట్ గుజరాత్ అనే చిన్న విత్తనం నాటామని, ఇప్పుడు అది మహా వృక్షంగా ఎదిగిందని ఆనందం వ్యకం చేశారు. అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం గుజరాత్లో పారిశ్రామిక అభివృద్ధికి ఎలాంటి ప్రోత్సాహం ఇవ్వలేదని, అలాంటి సమయంలోనూ వైబ్రంట్ గుజరాత్ సదస్సు విజయవంతమైందని చెప్పారు. గుజరాత్‌ను భారత్ గ్లోత్ ఇంజన్‌గా తీర్చిదిద్దడానికి ఈ సదస్సు నిర్వహించామని తెలియజేశారు. ఆనాటి కల వాస్తవ రూపం దాలి్చందన్నారు. 2014లో తనకు దేశసేవ చేసే అవకాశం వచి్చనప్పుడు భారత్‌ను గ్లోబల్ గ్లోత్ ఇంజన్‌గా మార్చాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నానని వెల్లడించారు. భారత్ త్వరలో గ్లోబల్ ఎకనామిక్ పవర్‌హౌజ్‌గా మారే దశలో ప్రస్తుతం మనం ఉన్నామని పేర్కొన్నారు. అంతర్జాతీయ సంస్థలతోపాటు నిపుణులు ఇదే మాట చెబుతున్నారని గుర్తుచేశారు. మరికొన్ని సంవత్సరాల్లో మన దేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. గుజరాత్‌ను అప్రతిష్టపాలు చేసే కుట్రలు వైబ్రంట్ గుజరాత్ మొదటి సదస్సు జరిగాక ఇలాంటి కార్యక్రమాలు దేశంలో సంస్థాగతం మారిపోయాయని, చాలా రాష్ట్రాలు పెట్టుబడిదారుల సదస్సులు నిర్వహించాయని, ఇప్పటికీ నిర్వహిస్తున్నాయని ప్రధాని మోదీ తెలిపారు. వైబ్రంట్ గుజరాత్ సదస్సులో వచ్చిన సత్ఫలితాలను ఇప్పుడు కళ్లారా చూస్తున్నామని హర్షం వ్యక్తం చేశారు. వాస్తవానికి ఈ సదస్సుకు ఎన్నో ఇబ్బందులు, సవాళ్లు ఎదురయ్యాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన సహకారం లభించలేదని చెప్పారు. విదేశీ పెట్టుబడిదారులకు అనాటి కేంద్ర మంత్రుల నుంచి బెదిరింపులు వచ్చాయన్నారు. అయినప్పటికీ విదేశీ పెట్టుబడిదారులు ధైర్యంగా సదస్సులో పాల్గొన్నారని ప్రశంసించారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్నో అవరోధాలు ఎదురయ్యాయని, ప్రకృతి విపత్తులు సంభవించామని, గోద్రా ఉదంతం, ఆ తర్వాత అల్లర్లు జరిగాయని నరేంద్ర మోదీ చెప్పారు. ఈ పరిణామాలతో గుజరాత్ కుప్పకూలుతుందని, దేశానికి పెద్ద భారంగా మారిపోతోందని చాలామంది అంచనా వేశారని తెలిపారు. అంతర్జాతీయంగా గుజరాత్‌ను అప్రతిష్టపాలు చేసే కుట్రలు సైతం జరిగాయన్నారు. అన్నింటినీ తట్టుకొని గుజరాత్ అద్భుతమైన అభివృద్ధి సాధించిందని వ్యాఖ్యానించారు. 21వ శతాబ్దంలో గుజరాత్ రాష్ట్రం వ్యవసాయ ఆర్థిక శక్తిగా, ఆర్థిక హబ్‌గా మారిందని ప్రధానమంత్రి కితాబిచ్చారు. తన పేరిట ఒక్క ఇల్లు కూడా లేదని, కానీ, తమ ప్రభుత్వం లక్షలాది మంది ఆడబిడ్డలను ఇంటి యజమానులుగా మార్చిందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ప్రభుత్వ పథకాల కింద సొంత ఇళ్లు నిర్మించి ఇచ్చామని, వాటితో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఆడబిడ్డలు లక్షాధికారులు అయ్యారని ఆనందం వ్యక్తం చేశారు. గుజరాత్ రాష్ట్రం చోటౌదేపూర్ జిల్లా బొడేలీ పట్టణంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించారు. -
టాప్ 50లో నిలవడమే లక్ష్యం
గాంధీనగర్: సులభతర వాణిజ్యం కేటగిరీలో టాప్ 50 దేశాల్లో ఒకటిగా నిలవటమే భారత్ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రపంచ బ్యాంక్ రూపొందించిన సులభతర వాణిజ్య దేశాల జాబితాలో ప్రస్తుతం మన దేశం 75 స్థానాలు ఎగబాకి 77వ స్థానంలో నిలిచిందని, వచ్చే ఏడాది ఈ జాబితాలో టాప్ 50 దేశాల్లో ఒకటిగా నిలిచేలా కృషి చేయాల్సిందిగా తన జట్టును కోరానని చెప్పారు. ప్రపంచంలోనే అత్యుత్తమమైన నిబంధనలు భారత్‌లో ఉండాలని, వ్యాపారం చేయడం చౌకగా ఉండే ప్రయత్నాలు కూడా చేయనున్నామని తెలిపారు. శుక్రవారం ఇక్కడ 9వ వైబ్రాంట్ గుజరాత్ గ్లోబల్ సదస్సును ప్రారంభిస్తూ... దేశ, విదేశాల నుంచి వచ్చిన రాజకీయ, వ్యాపార వేత్తలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అడ్డంకులు తొలగిస్తాం... అభివృద్ధిని కుంటుపరిచే అడ్డంకులను తొలగించటంపై దృష్టి పెడుతున్నామని, సంస్కరణలు కొనసాగిస్తామని, అనవసరమైన నియంత్రణలు ఎత్తివేస్తామని మోదీ ఉద్ఘాటించారు. జీఎస్టీ అమలు, పన్నుల హేతుబద్ధీకరణ కారణంగా లావాదేవీల వ్యయాలు తగ్గాయని, వివిధ కార్యకలాపాలు మెరుగుపడ్డాయని వివరించారు. డిజిటల్ ప్రక్రియలు, ఆన్లైన్ లావాదేవీలు, సింగిల్ పాయింట్ ఇంటర్ఫేస్ వంటి అంశాల కారణంగా వ్యాపారం చేయడం వేగవంతమవుతోందని తెలిపారు. ఐటీ ఆధారిత లావాదేవీల ద్వారానే ప్రభుత్వ కొనుగోళ్లు, సమీకరణలు, డిజిటల్ చెల్లింపులు కూడా జరుగుతున్నాయని వెల్లడించారు. పాలన మెరుగుపడేలా చూ స్తున్నామని, ‘సంస్కరణలు, పనితీరు సాధించడం, మార్పు తీసుకురావడం, మరింత మెరుగైన పనితీరు సాధించడం తమ తారక మంత్రమని తెలిపారు. ఆర్థిక వ్యవస్థపై విశ్వాసం.... తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయిందని, వివిధ అంశాల్లో చాలా మార్పు కనిపిస్తోందని మోదీ పేర్కొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడానికి విప్లవాత్మకమైన చర్యలు తీసుకున్నామని, లోతైన వ్యవస్థాగతమైన సంస్కరణలు చేపట్టామని వివరించారు. వీటన్నింటి ఫలితంగానే ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి, మూడీస్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలు మన ఆర్థిక వ్యవస్థపై గట్టి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాయని తెలిపారు. సంస్కరణలు తేవడంలో, నియంత్రణలు తొలగించడంలో ఇదే జోరు కొనసాగిస్తామని పేర్కొన్నారు. నాలుగేళ్లలో 26,300 కోట్ల డాలర్ల ఎఫ్‌డీఐలు ప్రభుత్వ విధానాల కారణంగా భారత్‌లోకి గత నాలుగేళ్లలో 26,300 కోట్ల డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ)లు వచ్చాయని నరేంద్ర మోదీ తెలిపారు. అంతకు ముందటి 18 ఏళ్లలో ఈ పెట్టుబడుల్లో సగం కూడా రాలేదని వివరించారు. అన్ని రంగాల్లో ఎఫ్‌డీఐలను ఆహ్వానిస్తున్నామని, 90 శాతానికి పైగా ఆమోదాలు ఆటోమేటిక్ రూట్లోనే లభిస్తున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి చర్యల కారణంగా మన ఆర్థిక వ్యవస్థ అధిక వృద్ధి బాటన పయనిస్తోందని పేర్కొన్నారు. గత నాలుగేళ్లలో సగటున ఏడాదికి 7.3 శాతం వృద్ధిని సాధించామని, 1991 తర్వాత జీడీపీ జోరు పెరిగిందని తెలిపారు. మన దేశంలో యువ జనాభా బాగా పెరుగుతోందని, వీరి కోసం ఉద్యోగకల్పన, మరింత మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన జరిగాల్సిన అవసరముందని పేర్కొన్నారు. అందుకే తయారీ, మౌలిక రంగాలపై ఎన్నడూ లేనంతగా దృష్టి పెడుతున్నామని తెలిపారు. ఆధునికమైన, సత్తాగల నవ భారత్‌ను నిర్మించే దిశగా మౌలిక రంగంలో పెట్టుబడులు సమీకరించే ప్రయత్నాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని వివరించారు. యురేనియం సరఫరాపై ఒప్పందం వైబ్రాంట్ గుజరాత్ సదస్సు సందర్భంగా అణు రియాక్టర్లలో ఇంధనంగా ఉపయోగపడే యురేనియం సరఫరా కోసం భారత్, ఉజ్బెకిస్తాన్ దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ప్రధాని మోదీ, ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయెవ్‌ల సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. పదేళ్లలో రూ.6 లక్షల కోట్ల పెట్టుబడులు: రిలయన్స్ ఇండస్ట్రీస్ రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ గుజరాత్లో పదేళ్లలో రూ.6 లక్షల కోట్ల మేర పెట్టుబడులు పెట్టనుంది. ఇంధన, పెట్రో కెమికల్, డిజిటల్, తదితర రంగాల్లో ఈ పెట్టుబడులు పెడతామని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ తెలిపారు. రిలయన్స్‌కు జన్మభూమి, కర్మభూమి(కార్యస్థలం) కూడా ఇదేనని, తమ తొలి ఎంపిక ఎప్పుడూ గుజరాతే అవుతుందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటివరకూ రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టామని, పది లక్షలమందికి పైగా జీవనోపాధి కల్పించామని పేర్కొన్నారు. రానున్న పదేళ్లలో రూ.6 లక్షల కోట్ల పెట్టుబడులు పెడతామని, 20 లక్షల మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. రిలయన్స్ జియో త్వరలో వినూత్నమైన కొత్త కామర్స్ ప్లాట్ఫార్మ్ను అందుబాటులోకి తేనున్నదని ముకేశ్ అంబానీ వెల్లడించారు. గుజరాత్లో 12 లక్షలకు పైగా ఉన్న చిన్న దుకాణ దారులు, రిటైలర్ల కోసం ఈ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తెస్తామన్నారు. ఐదేళ్లలో రూ.55,000 కోట్లు: అదానీ గత ఐదేళ్లలో గుజరాత్లో రూ.50,000 కోట్లకు మించి పెట్టుబడులు పెట్టామని అదానీ గ్రూప్ పేర్కొంది. పెట్టుబడుల జోరును మరింతగా పెంచుతామని, రానున్న ఐదేళ్లలో రూ.55,000 కోట్ల మేర పెట్టుబడులు పెడతామని గౌతమ్ అదానీ వెల్లడించారు. ముంద్రాలో బీఏఎస్ఎఫ్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్న పెట్రో కెమికల్ ప్లాంట్ కాకుండా ఈ పెట్టుబడులు పెడతామన్నారు. రూ.55,000 కోట్ల పెట్టుబడుల్లో భాగంగా ప్రపంచంలోనే పెద్దదైన సోలార్ హైబ్రిడ్ పార్క్‌ను ఖవ్డాలో నిర్మిస్తామని, ముంద్రాలో 1 గిగావాట్ డేటా సెంటర్ పార్క్‌ను ఏర్పాటు చేస్తామని, 10 లక్షల టన్నుల కాపర్ స్మెల్టింగ్, రిఫైనింగ్ ప్రాజెక్ట్‌ను, సమగ్రమైన లి«థియం అయాన్ బ్యాటరీల ప్లాంట్ ఏర్పాటు చేస్తామని వివరించారు. టాటాల లిథియం అయాన్ ప్లాంట్ టాటా గ్రూప్ గుజరాత్లో లిథియం అయాన్ బ్యాటరీల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నది. గ్రూప్ కంపెనీల్లో ఒకటైన టాటా కెమికల్స్ సోడాయాష్ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింతగా పెంచుకునే ప్రయత్నాలు చేస్తోందని టాటా గ్రూప్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ చెప్పారు. టాటా మోటార్స్, టాటా కెమికల్స్ వంటి తమ గ్రూప్ కంపెనీలు గుజరాత్‌లోనే చెప్పుకోదగ్గ స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, తమ పెట్టుబడులను మరింతగా కొనసాగిస్తామని పేర్కొన్నారు. బిర్లా.. మూడేళ్లలో 15,000 కోట్లు మూడేళ్లలో రూ.15,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నామని ఆదిత్య బిర్లా గ్రూప్ వెల్లడించింది. ఇప్పటికే గుజరాత్లో రూ.30,000 కోట్లకు మించి పెట్టుబడులు పెట్టామని ఈ గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా తెలిపారు. టెక్స్టైల్స్, రసాయనాలు, గనులు ఇలా విభిన్న రంగాల్లో మూడేళ్లలో రూ.15,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని పేర్కొన్నారు. టొరెంట్ గ్రూప్ రూ.10,000 కోట్లు గుజరాత్లో ఇప్పటికే రూ.30,000 కోట్ల పెట్టుబడులు పెట్టామని, మరో రూ.10,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నామని టొరెంట్ గ్రూప్ చైర్మన్ సుధీర్ మెహతా చెప్పారు. పునరుత్పాదన ఇంధన, విద్యుత్, గ్యాస్ పంపిణీ రంగాల్లో ఈ పెట్టుబడులు పెడతామని వివరించారు. సుజుకీ మూడో ప్లాంట్ జపాన్ వాహన దిగ్గజం సుజుకి మోటార్ కార్పొరేషన్ (మారుతీ సుజుకీ మాతృ కంపెనీ) తన మూడవ ప్లాంట్‌నూ గుజరాత్‌లోనే ఏర్పాటు చేయనుంది. తొలి ప్లాంట్‌ను 2017లో ప్రారంభించామని, త్వరలో రెండో ప్లాంట్ అందుబాటులోకి రానున్నదని, 2020లో మూడో ప్లాంట్‌ను కూడా గుజరాత్‌లోనే ఏర్పాటు చేస్తామని సుజుకి మోటార్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ తొషిహిరో సుజుకీ వెల్లడించారు. టయోటా కంపెనీ సాంకేతిక సహకారంతో కొత్త హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడతామని తెలిపారు .నయార ఎనర్జీ (రష్యాకు రాస్‌నెఫ్ట్ సంస్థది) వాదినార్‌లోని రిఫైనరీ విస్తరణ నిమిత్తం 85 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నది. మాంగనీస్ తయారు చేసే ఎమ్ఓఐఎల్ గుజరాత్‌కు చెందిన జీఎమ్‌డీసీ కంపెనీతో కలిసి రూ.250 కోట్ల పెట్టుబడులతో ఒక ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. సదస్సు తొలి రోజున గుజరాత్ ప్రభుత్వం వివిధ రంగాల సంస్థలతో 130 ఒప్పందాలు (ఎంవోయూ) కుదుర్చుకుంది. వీటి పెట్టుబడుల విలువ రూ. 56,000 కోట్లపైగా ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. చైనాకు చెందిన సింగ్షాన్ గ్రూప్ రూ. 21,000 కోట్లతో ఉక్కు, కార్ల బ్యాటరీల ప్లాంటు ఏర్పాటుకు ఎంవోయూ కుదుర్చుకుంది. డేటా దురాక్రమణ నుంచి దేశాన్ని కాపాడండి ప్రధానిని కోరిన ముకేశ్ అంబానీ ప్రపంచ కంపెనీలు డేటా దురాక్రమణకు (డేటా కాలనైజేషన్) పాల్పడుతున్నాయని, దీనిని నివారించే చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీని రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ ముకేశ్ అంబానీ కోరారు. రాజకీయ దురాక్రమణకు వ్యతిరేకంగా మహాత్మా గాంధీ ఉద్యమించినట్లుగానే డేటా దురాక్రమణకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరముందని వివరించారు. ప్రస్తుతమున్న ఫేస్బుక్, వాట్సాప్ వంటి కొత్త ప్రపంచంలో డేటా అనేది కొత్త సంపద అని, భారతీయుల డేటా భారతీయులకే సొంతమని చెప్పారు. భారత డేటాపై అంతర్జాతీయ కంపెనీల, కార్పొరేట్ల నియంత్రణ ఉండకూడదని భారతీయుల నియంత్రణే ఉండాలని పేర్కొన్నారు. -
14 ఏళ్ల కుర్రాడు.. 5 కోట్ల కాంట్రాక్టు పట్టాడు!
-
14 ఏళ్ల కుర్రాడు.. 5 కోట్ల కాంట్రాక్టు పట్టాడు!
వైబ్రెంట్ గుజరాత్ సదస్సు జరుగుతోంది.. అక్కడ అంతా దిగ్గజాలు కొలువుదీరారు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 12 దేశాలు ఇందులో భాగస్వాములుగా కూడా ఉన్నాయి. అలాంటి సదస్సులో సరిగ్గా 15 ఏళ్లు కూడా లేని ఓ చిన్న పిల్లాడు కళ్లజోడు పెట్టుకుని, నీలి రంగు సూట్ వేసుకుని వచ్చాడు. మాటలతో అక్కడున్నవారిని మంత్రముగ్ధులను చేశాడు. తాను డిజైన్ చేసిన డ్రోన్‌ను అక్కడివారికి చూపించాడు.. అంతే, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం తమకు అలాంటి డ్రోన్ కావాలంటూ అతడితో 5 కోట్ల రూపాయలకు ఎంఓయూ కుదుర్చుకుంది. అతడెవరో కాదు.. హర్షవర్ధన్ జాలా. వయసు 14 సంవత్సరాలు. చదివేది పదో తరగతి. ఏరోబాటిక్స్ 7 టెక్ సొల్యూషన్స్ అనే సంస్థకు వ్యవస్థాపకుడు, సీఈఓ. గుజరాత్ ప్రభుత్వంలోని శాస్త్ర సాంకేతిక శాఖ అతడితో ఒప్పందం కుదుర్చుకుంది. యుద్ధ ప్రాంతాల్లోను, సరిహద్దుల్లోను మందుపాతరలను గుర్తించి, వాటిని నిర్వీర్యం చేసేందుకు ఉపయోగపడే డ్రోన్లను అతడు రూపొందించాడు. తన తోటి పిల్లలంతా పదో తరగతి పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటే, అతడు మాత్రం తన వ్యాపారాన్ని ఎలా విస్తరించుకోవాలా అని ప్లాన్లు వేస్తూ ఇప్పటికే మూడు నమూనా డ్రోన్లు తయారు చేసేశాడు. గత సంవత్సరమే తాను ఈ తరహా డ్రోన్లను రూపొందించడంపై దృష్టి పెట్టానని, టీవీ చూస్తున్నప్పుడు చాలామంది సైనికులు మందుపాతరలు పేలి మరణించడం లేదా తీవ్రంగా గాయపడటం లాంటి ఘటనలు చూసినప్పుడు తనకు ఈ ఆలోచన వచ్చిందని అతడు చెప్పాడు. ఈ మూడు నమూనా డ్రోన్లు తయారుచేయడానికి అతడికి 5 లక్షలు కూడా పూర్తిగా ఖర్చవలేదు. కానీ 5 కోట్ల కాంట్రాక్టు పట్టేశాడు. ఈ డ్రోన్‌లో ఇన్ఫ్రారెడ్, ఆర్జీబీ సెన్సర్ ఉంటుందని, దాంతోపాటు థర్మల్ మీటర్, 21 మెగాపిక్సెళ్ల కెమెరా, మెకానికల్ షట్టర్ ఉంటాయని చెప్పాడు. వీటి సాయంతో ఇది హై రిజల్యూషన్ ఫొటోలు తీసి పంపుతుందని వివరించాడు. భూమికి 2 అడుగుల ఎత్తున ఎగురుతూ, 8 చదరపు మీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతం మొత్తాన్ని ఈ డ్రోన్ కవర్ చేస్తుంది. ఆ పరిధిలో ఎక్కడైనా మందుపాతరలను గుర్తిస్తే వెంటనే బేస్ స్టేషన్‌కు తెలియజేస్తుంది. ఇందులో 50 గ్రాముల బరువున్న బాంబు ఒకటి ఉంటుంది. అది మందుపాతరను ధ్వంసం చేస్తుంది. తన కంపెనీ ఏరోబాటిక్స్ పేరు మీద ఈ డ్రోన్‌కు ఇప్పటికే పేటెంట్ కూడా రిజిస్టర్ చేసేశాడు. హర్షవర్ధన్ తండ్రి ప్రద్యుమ్నసింగ్ జాలా నరోడాలోని ఒక ప్లాస్టిక్ కంపెనీలో అకౌంటెంటుగా పనిచేస్తున్నారు. తల్లి నిషాబా జాలా గృహిణి. గతంలో అమెరికాలోని గూగుల్ ప్రధాన కార్యాలయానికి వెళ్లే అవకాశం వచ్చినప్పుడు అతడికి తన సొంత ఉత్పత్తికి పేటెంట్ పొందాలని కోరిక పుట్టింది. తన కంపెనీ భవిష్యత్తులో యాపిల్, గూగుల్ కంటే పెద్దది కావాలని అతడు ఆశిస్తున్నాడు. ఇప్పుడు తన ఎంఓయూ సంగతి పెట్టుబడిదారులకు చెబుతానని, వాళ్లు తన కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తారనే ఆశిస్తున్నానని అన్నాడు. -
గుజరాత్‌కు జియో బంపర్ ఆఫర్
వైబ్రెంట్ గుజరాత్ సదస్సు సందర్భంగా ఆ రాష్ట్రంపై రిలయన్స్ సంస్థల అధినేత ముకేష్ అంబానీ వరాల జల్లు కురిపించారు. తమది అచ్చమైన గుజరాతీ కంపెనీయేనని ఆయన బల్లగుద్ది మరీ చెప్పారు. తన తండ్రి ధీరూభాయ్ అంబానీ గుజరాత్‌లోనే వ్యాపారం మొదలుపెట్టారని గుర్తుచేశారు. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లు, కాలేజీలు, ఆస్పత్రులు, వైద్య కేంద్రాలు అన్నింటినీ జియోతో అనుసంధానం చేస్తామని చెప్పారు. పిల్లలే మన భవిష్యత్తు అని, వారికి సాయపడేందుకే ఇలా చేస్తున్నామని అన్నారు. దేశంలో 50 లక్షల రిలయన్స్ జియో కస్టమర్లను సాధించిన తొలి రాష్ట్రం గుజరాత్ అని చెప్పడానికి గర్వపడుతున్నట్లు అంబానీ చెప్పారు. ప్రపంచంలో ఏ నాయకుడూ ఇంత తక్కువ కాలంలో ప్రజల ఆలోచనా ధోరణిని మార్చలేదని ప్రశంసించారు. అగ్రగామి రాష్ట్రం ఇదే కాగా, ఉప్పు నుంచి సాఫ్ట్వేర్ వరకు అన్నింటినీ అమ్మే టాటా కంపెనీల గ్రూప్ తాత్కాలిక చైర్మన్ రతన్ టాటా కూడా ప్రధాని నరేంద్రమోదీపై ప్రశంసలు కురిపించారు. గుజరాత్‌ను మోదీ ఉత్పత్తుల కేంద్రంగా రూపొందించారని, నవభారతంలో గుజరాత్ అగ్రగామి రాష్ట్రం అవ్వడం ఖాయమని తెలిపారు. ఇంత మంచి నాయకత్వం అందిస్తున్నందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలని అన్నారు. ఏమిటీ సదస్సు? వైబ్రెంట్ గుజరాత్.. నరేంద్రమోదీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రారంభించిన సదస్సు. ఇప్పుడు ఇది వరుసగా ఎనిమిదో సంవత్సరం జరుగుతోంది. ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం ప్రారంభించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ, టాటా గ్రూపు తాత్కాలిక చైర్మన్ రతన్ టాటా తదితరులతో పాటు దాదాపు 20 దేశాల అధినేతలు, మంత్రులు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వామ్య దేశాలుగా ఉండేందుకు 12 దేశాలు అంగీకరించాయి. అవి.. అమెరికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, కెనడా, డెన్మార్క్, ఫ్రాన్స్, జపాన్, నెదర్లాండ్స్, పోలండ్, సింగపూర్, స్వీడన్, యూఏఈ. -
పాలీహౌస్‌కు ప్రాధాన్యం: పోచారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం పాలీహౌస్‌కు అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. గుజరాత్లో జరుగుతోన్న ‘గుజరాత్ వైబ్రంట్’ ఎక్స్‌పోలో ఆయన సోమవారం వ్యవసాయ రంగంపై మాట్లాడారు. ఆ విశేషాలను మంత్రి ‘సాక్షి’కి తెలిపారు. వ్యవసాయం, సూక్ష్మసేద్యం, తుంపర్ల సేద్యం, పాలీహౌస్ తదితర అంశాలపై చర్చ జరిగినట్లు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది వెయ్యి ఎకరాల్లో 75 శాతం సబ్సిడీతో పాలీహౌస్ ప్రాజెక్టును చేపడుతుందన్నారు. దీనికి రూ. 250 కోట్లు కేటాయించామన్నారు. సూక్ష్మసేద్యం చేపట్టే ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం, బీసీలకు 90 శాతం, ఇతరులకు 80 శాతం సబ్సిడీ ఇస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యవసాయ మంత్రులతో చర్చలు జరిపారు. -
వాణిజ్యం ఎంతో సులభం
గాంధీనగర్: సుస్థిరమైన పన్ను విధానం, పారదర్శకమైన, న్యాయబద్ధమైన విధాన వాతావరణం కల్పించడం ద్వారా.. ప్రపంచ సమాజం వాణిజ్యం చేయడానికి భారతదేశాన్ని అత్యంత సులువైన ప్రదేశంగా తీర్చిదిద్దుతామని ప్రధాని నరేంద్రమోదీ హామీ ఇచ్చారు. అన్ని రంగాలు, ప్రాంతాలను అపరిమితంగా అభివృద్ధి చేస్తామని కూడా మాట ఇచ్చారు. రెండేళ్లకు ఒకసారి జరిగే వైబ్రంట్ గుజరాత్ శిఖరాగ్ర సదస్సు ఆదివారమిక్కడ ప్రారంభమైంది. మూడు రోజుల సదస్సులో తొలిరోజు.. గుజరాత్లో వివిధ రంగాల్లో భారీ పెట్టుబడులపై వివిధ దేశీయ, విదేశీ కంపెనీలు 31 అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఏడోసారి జరుగుతున్న ఈ శిఖరాగ్ర సదస్సును మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అమెరికా విదేశాంగ మంత్రి జాన్‌కెర్రీ, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కి మూన్‌లతో పాటు అంతర్జాతీయ, దేశీయ సంస్థల సీఈఓలు హాజరయ్యారు. మోదీ ప్రసంగిస్తూ.. ‘‘నిరాశ, అస్థిరత వాతావరణం ఏడు నెలల కాలంలోనే వెళ్లిపోయాయి. మీకు ఎప్పుడవసరమైనా ప్రభుత్వం చేయూతనిస్తుంది. మీరు ఓ అడుగు ముందుకు వేస్తే.. మీ కోసం మా ప్రభుత్వం రెండడుగులు వేస్తుంది’’ అని అన్నారు. భారతదేశం రూపాంతరం చెందుతోందని, విధాన చోదక పాలనను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. అభివృద్ధిని పెంపొందించేందుకు, ఉద్యోగసృష్టిని ప్రోత్సహించేందుకు తయారీపరిశ్రమకు ఊతమివ్వాలని అన్నారు. దీనికోసం ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చేందుకు కేంద్ర, రాష్ట్రాల స్థాయిల్లో సింగిల్ విండో విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. వేగవంతమైన, సమీకృత అభివృద్ధికి కృషి గత ఐదేళ్లలో ఆర్థికాభివృద్ధి మందగించిందని.. ఇప్పుడు తన ప్రభుత్వం వేగవంతమైన, సమీకృతమైన అభివృద్ధిని సాధించేందుకు శాయశక్తులా కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఆర్థిక సంస్కరణల చక్రాన్ని వేగంగా పూర్తిచేయటానికి కట్టుబడి ఉన్నామన్నారు. ప్రభుత్వ - ప్రయివేటు పెట్టుబడుల ద్వారా ప్రధానంగా.. రహదారులు, గ్యాస్ గ్రిడ్లు, విద్యుత్, నీటి వ్యవస్థలు, సాగునీటి పారుదల, నదుల ప్రక్షాళన వంటి మౌలిక సదుపాయాల నిర్మాణంపై దృష్టి కేంద్రీకరించామని వివరించారు. ప్రాథమిక ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికాల్లో వృద్ధి రేటు గత ఏడాది వృద్ధి రేటుకన్నా ఒక్క శాతం పెరిగిందని చెప్పారు. రాబోయే సంవత్సరాల్లో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న రెండోదేశంగా ఉంటుందని ఐఎంఎఫ్ జోస్యం చెప్పిందని ఉటంకించారు. గాంధీ చూపిన మార్గంలో నడవాలి... మహాత్మా గాంధీ సూచించిన మార్గంలో నడవాలని మోదీ పిలుపునిచ్చారు. ‘‘చిట్టచివరి మనిషి గురించి మహాత్మా గాంధీ సరిగ్గా చెప్పారు. గాంధీజీ సందేశం మనకు మార్గాన్ని చూపగలదు. ఈ కార్యక్రమం ఇచ్చే ఉత్తమ ఫలితం.. మనం శ్రద్ధ పెట్టాల్సిన, అభివృద్ధి చేయాల్సిన ప్రజా సమూహాలను చేర్చుకోవటం, వారికి స్థానమివ్వటం కావాలి’’ అని పేర్కొన్నారు. సదస్సులో రక్షణ మంత్రి మనోహర్ పారికర్ మాట్లాడుతూ.. రక్షణ రంగ తయారీ, కొనుగోళ్లకు సంబంధించి రెండు మూడు నెలల్లో పారిశ్రామిక అనుకూలమైన విధానాన్ని ప్రకటించనున్నట్లు తెలిపారు. ఉగ్ర నిరోధంలో సహకారంపై చర్చలు ఉగ్రవాద వ్యతిరేక సహకారం, మరింతగా ఆర్థిక సంబంధాలు తదితర అంశాలపై ప్రధాని మోదీ ఆదివారం నాడు అమెరికా, కెనడా దేశాల సీనియర్ నాయకులతో చర్చించారు. వైబ్రంట్ గుజరాత్ సదస్సుకు హాజరైన అమెరికా విదేశాంగ మంత్రి జాన్‌కెర్రీతో సమావేశమైన మోదీ.. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా త్వరలో చేపట్టనున్న భారత పర్యటన అంశంపై ప్రధానంగా చర్చించారు. ఉగ్రవాద వ్యతిరేక సహకారం, ఆర్థిక అంశాలు, ప్రాంతీయ అంశాలు కూడా ఈ భేటీలో చర్చకు వచ్చాయని పీఎంఓ ఒక ప్రకటనలో తెలిపింది. కెనడా పౌరసత్వ, వలస విభాగం మంత్రి క్రిస్ అలెగ్జాండర్‌తో కూడా మోదీ భేటీ అయ్యారు. ఈ సమావేశంలోనూ ఉగ్రవాద వ్యతిరేక సహకారం కీలకాంశంగా చర్చకు వచ్చింది. కెనడా పార్లమెంటుపై ఉగ్రవాదుల దాడిని మోదీ ఖండించారు. ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించరాదని ఉద్ఘాటించారు. అలాగే.. తాను కెనడా పర్యటనకు వెళ్లే అంశంపైనా మోదీ చర్చించారు. ఇజ్రాయెల్ వ్యవసాయ మంత్రి యాయిర్ షమీర్తోనూ మోదీ సమావేశమయ్యారు. వ్యవసాయ రంగంలో ఆ దేశం నుంచి మరింత సహకారం అందించాలని కోరారు. ఇరాన్ అధ్యక్షుడికి సీనియర్ సలహాదారుడైన అక్బర్ టోర్కాన్తోనూ మోదీ భేటీ అయ్యారు. ఈ భేటీలో చాబాహార్ పోర్ట్ ప్రాజెక్టు అమలు ప్రగతిపై సమీక్షించారు. ఐరాససెక్రటరీ జనరల్ బాన్ కి-మూన్, ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు జియ్యాంగ్కిమ్లతో వేర్వేరుగా భేటీ అయిన మోదీ.. వాతావరణ మార్పులు, కాలుష్య రహిత ఇంధనశక్తి అంశాలపై చర్చించారు. మాసిడోనియా ప్రధానమంత్రితో మోదీ భేటీలో.. వాణిజ్య, పెట్టుబడుల సంబంధాలను పెంపొందించుకోవాలని ఇరుపక్షాలూ అంగీకరించాయి. రష్యాలోని ఆస్ట్రాకాన్ గవర్నర్ ల్కిన్తో భేటీ సందర్భంగా.. భారత్ తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. అన్ని రంగాలు, ప్రాంతాలను అపరిమితంగా అభివృద్ధి చేస్తాం