గుజరాత్‌కు జియో బంపర్ ఆఫర్
Published Tue, Jan 10 2017 4:51 PM | Last Updated on Wed, Aug 15 2018 2:30 PM
వైబ్రెంట్ గుజరాత్ సదస్సు సందర్భంగా ఆ రాష్ట్రంపై రిలయన్స్ సంస్థల అధినేత ముకేష్ అంబానీ వరాల జల్లు కురిపించారు. తమది అచ్చమైన గుజరాతీ కంపెనీయేనని ఆయన బల్లగుద్ది మరీ చెప్పారు. తన తండ్రి ధీరూభాయ్ అంబానీ గుజరాత్‌లోనే వ్యాపారం మొదలుపెట్టారని గుర్తుచేశారు. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లు, కాలేజీలు, ఆస్పత్రులు, వైద్య కేంద్రాలు అన్నింటినీ జియోతో అనుసంధానం చేస్తామని చెప్పారు. పిల్లలే మన భవిష్యత్తు అని, వారికి సాయపడేందుకే ఇలా చేస్తున్నామని అన్నారు. దేశంలో 50 లక్షల రిలయన్స్ జియో కస్టమర్లను సాధించిన తొలి రాష్ట్రం గుజరాత్ అని చెప్పడానికి గర్వపడుతున్నట్లు అంబానీ చెప్పారు. ప్రపంచంలో ఏ నాయకుడూ ఇంత తక్కువ కాలంలో ప్రజల ఆలోచనా ధోరణిని మార్చలేదని ప్రశంసించారు.
అగ్రగామి రాష్ట్రం ఇదే
కాగా, ఉప్పు నుంచి సాఫ్ట్‌వేర్ వరకు అన్నింటినీ అమ్మే టాటా కంపెనీల గ్రూప్ తాత్కాలిక చైర్మన్ రతన్ టాటా కూడా ప్రధాని నరేంద్రమోదీపై ప్రశంసలు కురిపించారు. గుజరాత్‌ను మోదీ ఉత్పత్తుల కేంద్రంగా రూపొందించారని, నవభారతంలో గుజరాత్ అగ్రగామి రాష్ట్రం అవ్వడం ఖాయమని తెలిపారు. ఇంత మంచి నాయకత్వం అందిస్తున్నందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలని అన్నారు.
ఏమిటీ సదస్సు?
వైబ్రెంట్ గుజరాత్.. నరేంద్రమోదీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రారంభించిన సదస్సు. ఇప్పుడు ఇది వరుసగా ఎనిమిదో సంవత్సరం జరుగుతోంది. ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం ప్రారంభించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ, టాటా గ్రూపు తాత్కాలిక చైర్మన్ రతన్ టాటా తదితరులతో పాటు దాదాపు 20 దేశాల అధినేతలు, మంత్రులు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వామ్య దేశాలుగా ఉండేందుకు 12 దేశాలు అంగీకరించాయి. అవి.. అమెరికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, కెనడా, డెన్మార్క్, ఫ్రాన్స్, జపాన్, నెదర్లాండ్స్, పోలండ్, సింగపూర్, స్వీడన్, యూఏఈ.
Advertisement