అహ్మదాబాద్ సైన్స్‌సిటీలోని రోబోటిక్స్ గ్యాలరీలో రోబో అందించిన టీ సేవిస్తున్న మోదీ
అహ్మదాబాద్/బొడేలీ: భారత్‌ను ప్రపంచ గ్రోత్ ఇంజన్‌గా మార్చాలన్నదే తన లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. మన దేశం త్వరలోనే ప్రపంచ ఆర్థిక శక్తి కేంద్రంగా అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ‘వైబ్రంట్ గుజరాత్’ తొలి శిఖరాగ్ర సదస్సుకు 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు.
20 సంవత్సరాల క్రితం వైబ్రంట్ గుజరాత్ అనే చిన్న విత్తనం నాటామని, ఇప్పుడు అది మహా వృక్షంగా ఎదిగిందని ఆనందం వ్యకం చేశారు. అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం గుజరాత్‌లో పారిశ్రామిక అభివృద్ధికి ఎలాంటి ప్రోత్సాహం ఇవ్వలేదని, అలాంటి సమయంలోనూ వైబ్రంట్ గుజరాత్ సదస్సు విజయవంతమైందని చెప్పారు. గుజరాత్‌ను భారత్ గ్లోత్ ఇంజన్‌గా తీర్చిదిద్దడానికి ఈ సదస్సు నిర్వహించామని తెలియజేశారు. ఆనాటి కల వాస్తవ రూపం దాలి్చందన్నారు.
2014లో తనకు దేశసేవ చేసే అవకాశం వచి్చనప్పుడు భారత్‌ను గ్లోబల్ గ్లోత్ ఇంజన్‌గా మార్చాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నానని వెల్లడించారు. భారత్ త్వరలో గ్లోబల్ ఎకనామిక్ పవర్‌హౌజ్‌గా మారే దశలో ప్రస్తుతం మనం ఉన్నామని పేర్కొన్నారు. అంతర్జాతీయ సంస్థలతోపాటు నిపుణులు ఇదే మాట చెబుతున్నారని గుర్తుచేశారు. మరికొన్ని సంవత్సరాల్లో మన దేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు.
గుజరాత్‌ను అప్రతిష్టపాలు చేసే కుట్రలు
వైబ్రంట్ గుజరాత్ మొదటి సదస్సు జరిగాక ఇలాంటి కార్యక్రమాలు దేశంలో సంస్థాగతం మారిపోయాయని, చాలా రాష్ట్రాలు పెట్టుబడిదారుల సదస్సులు నిర్వహించాయని, ఇప్పటికీ నిర్వహిస్తున్నాయని ప్రధాని మోదీ తెలిపారు. వైబ్రంట్ గుజరాత్ సదస్సులో వచ్చిన సత్ఫలితాలను ఇప్పుడు కళ్లారా చూస్తున్నామని హర్షం వ్యక్తం చేశారు. వాస్తవానికి ఈ సదస్సుకు ఎన్నో ఇబ్బందులు, సవాళ్లు ఎదురయ్యాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన సహకారం లభించలేదని చెప్పారు.
విదేశీ పెట్టుబడిదారులకు అనాటి కేంద్ర మంత్రుల నుంచి బెదిరింపులు వచ్చాయన్నారు. అయినప్పటికీ విదేశీ పెట్టుబడిదారులు ధైర్యంగా సదస్సులో పాల్గొన్నారని ప్రశంసించారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్నో అవరోధాలు ఎదురయ్యాయని, ప్రకృతి విపత్తులు సంభవించామని, గోద్రా ఉదంతం, ఆ తర్వాత అల్లర్లు జరిగాయని నరేంద్ర మోదీ చెప్పారు. ఈ పరిణామాలతో గుజరాత్ కుప్పకూలుతుందని, దేశానికి పెద్ద భారంగా మారిపోతోందని చాలామంది అంచనా వేశారని తెలిపారు. అంతర్జాతీయంగా గుజరాత్‌ను అప్రతిష్టపాలు చేసే కుట్రలు సైతం జరిగాయన్నారు.
అన్నింటినీ తట్టుకొని గుజరాత్ అద్భుతమైన అభివృద్ధి సాధించిందని వ్యాఖ్యానించారు. 21వ శతాబ్దంలో గుజరాత్ రాష్ట్రం వ్యవసాయ ఆర్థిక శక్తిగా, ఆర్థిక హబ్‌గా మారిందని ప్రధానమంత్రి కితాబిచ్చారు. తన పేరిట ఒక్క ఇల్లు కూడా లేదని, కానీ, తమ ప్రభుత్వం లక్షలాది మంది ఆడబిడ్డలను ఇంటి యజమానులుగా మార్చిందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ప్రభుత్వ పథకాల కింద సొంత ఇళ్లు నిర్మించి ఇచ్చామని, వాటితో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఆడబిడ్డలు లక్షాధికారులు అయ్యారని ఆనందం వ్యక్తం చేశారు. గుజరాత్ రాష్ట్రం చోటౌదేపూర్ జిల్లా బొడేలీ పట్టణంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment