గాందీనగర్: ప్రపంచవ్యాప్తంగా అనిశి్చత పరిస్థితులు కొనసాగుతున్న తరుణంలో భారత్ నూతన ఆశారేఖగా ఆవిర్భవించిందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ప్రపంచ దేశాలు భారత్‌ను స్థిరత్వానికి ఒక ముఖ్యమైన మూలస్తంభంగా, నమ్మకమైన మిత్రదేశంగా, భాగస్వామిగా, గ్లోబల్ ఎకానమీలో గ్రోత్ ఇంజన్‌గా, గ్లోబల్ సౌత్ దేశాల గొంతుకగా, టెక్నాలజీ హబ్‌గా, ప్రజాస్వామ్యసౌధంగా పరిగణిస్తున్నాయన్నారు.
మారుతున్న ప్రపంచ క్రమంలో విశ్వమిత్రగా భారత్ అవతరిస్తోందన్నారు. గాం«దీనగర్‌లో బుధవారం పదో ‘వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సదస్సు’ ప్రారం¿ోత్సవంలో మోదీ ప్రసంగించారు. త్వరలో భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం ఖాయమని రేటింగ్ ఏజెన్సీలన్నీ చెబుతున్నాయని గుర్తుచేశారు. ఉమ్మడి లక్ష్యాలను నిర్దేశించడంతోపాటు వాటిని సాధించగలమన్న విశ్వాసాన్ని ప్రపంచానికి భారత్ ఇస్తోందన్నారు.
పదేళ్లలో నిర్మాణాత్మక సంస్కరణలు
ప్రపంచ అభివృద్ధికి, శ్రేయస్సుకు 140 కోట్ల మంది భారతీయులు ప్రాధాన్యతలు, ఆకాంక్షలు ఒక ఆధారంగా నిలుస్తున్నాయని ప్రధానమంత్రి మోదీ పేర్కొన్నారు. ఇండియా ప్రాధాన్యతలు చాలా స్పష్టంగా ఉన్నాయని చెప్పారు. స్థిరమైన పారిశ్రామికాభివృద్ధి, ఆధునిక మౌలిక వసతులు, నూతన తయారీ రంగం, కొత్తతరం నైపుణ్యాలు, భవిష్యత్తు టెక్నాలజీ, కృత్రిమ మేధ, నవీన ఆవిష్కరణలు, గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధన వనరులు, సెమీ కండక్టర్ల తయారీకి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు.
ప్రస్తుత ప్రపంచ పరిణామాల నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ ప్రగతికి అద్భుత అవకాశాలు ఉన్నాయని వివరించారు. గత పదేళ్లలో నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టామని, మన ఆర్థిక వ్యవస్థకు ఈ సంస్కరణలే చోదకశక్తిగా మారుతున్నాయని వెల్లడించారు. కొన్ని నెలల క్రితమే 75వ స్వాతంత్య్ర దినోత్సవాలు ఘనంగా నిర్వహించుకున్నామని, 25 ఏళ్ల తర్వాత 100వ స్వాతంత్య్ర దినోత్సవాలు జరుపుకోబోతున్నాయని చెప్పారు. రాబోయే 25 సంవత్సరాలు మనకు అమృత కాలమని ఉద్ఘాటించారు. ‘అభివృద్ధి చెందిన భారత్’ అనే లక్ష్యాన్ని ఈ అమృత కాలంలో సాధించుకోవాలని ప్రజలను పిలుపునిచ్చారు.
విదేశీ పెట్టుబడులకు వెల్‌కం
మనందరి ఉమ్మడి కృషి వల్ల 21వ శతాబ్దంలో ఇండియాకు ఉజ్వలమైన భవిష్యత్తు లభించబోతోందని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. గత ఏడాది జీ20 కూటమికి భారత్ సారథ్యం వహించిందని, ప్రపంచ భవిష్యత్తు కోసం ఒక రోడ్‌మ్యాప్‌ను అందించిందని తెలియజేశారు. ఐ2యూ2(ఇండియా, ఇజ్రాయెల్, యూఏఈ, యూఎస్‌ఏ) గ్రూప్‌తోపాటు ఇతర బహుముఖీన సంస్థలతో సంబంధాలను నిరంతరం బలోపేతం చేసుకుంటున్నామని చెప్పారు.
టెక్నాలజీని సమర్థవంతంగా వాడుకుంటూ దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేశామని, 40 వేలకుపైగా కాలం చెల్లిన నిబంధనలను సులభతర వాణిజ్య విధానం, జీఎస్టీ కింద రద్దు చేశామని తెలిపారు. పెట్టుబడులను ఆకర్శించడానికి, గ్లోబల్ బిజినెస్‌కు ఇండియాను గమ్యస్థానంగా మార్చడానికి మూడు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై(ఎఫ్‌టీఏ) సంతకాలు చేశామని ప్రధాని మోదీ చెప్పారు. పలు కీలక రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహా్వనిస్తున్నామని అన్నా రు. దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పన కోసం రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెట్టామని వివరించారు. గత పదేళ్లలో పెట్టుబడి వ్యయాన్ని 10 రెట్లు పెంచామన్నారు.
టెక్నాలజీతో జీవితాల్లో మార్పు
గ్రీన్ ఎనర్జీ, పునరుత్పాదక ఇంధన రంగాల్లో భారత్ శరవేగంగా అభివృద్ధి సాధిస్తోందని మోదీ హర్షం వ్యక్తం చేశారు. గ్రీన్ ఎనర్జీలో మూడు రెట్లు, సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో 20 రెట్లు ప్రగతి నమోదైందని తెలిపారు. గత పదేళ్లలో చౌక ధరకే ఫోన్లు, డేటా వంటివి దేశంలో సరికొత్త డిజిటల్ విప్లవాన్ని తీసుకొచ్చాయని అన్నారు. ప్రతి గ్రామానికీ ఆప్టికల్ ఫైబర్, 5జీ టెక్నాలజీ రాకతో సామాన్య ప్రజల జీవితాల్లో మార్పు వచి్చందని చెప్పారు. 2028కల్లా భారత్ 5 ట్రిలియన్ డాలర్ల జీడీపీతో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం ఖాయమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. 2047 నాటికి సంపన్న దేశంగా మారుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment