గాంధీనగర్: గత రెండు దశాబ్దాలుగా వైబ్రంట్ గుజరాత్ సదస్సు అంతర్జాతీయ బిజినెస్ నెట్‌వర్కింగ్ ఈవెంట్‌గా ఆవిర్భవించింది. తద్వారా కార్పొరేట్ ప్రపంచం నుంచి భారీ పెట్టుబడులను ఆకట్టుకుంటోంది. తాజాగా 10వ వైబ్రంట్ గుజరాత్(2024) సదస్సులో రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేశ్ అంబానీ, అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీ, సుజుకీ మోటార్ కార్ప్ ప్రెసిడెంట్ తోషిహిరో సుజుకీ, టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ తదితరులు పెట్టుబడులకు ఆసక్తిని ప్రదర్శించారు. వెరసి తొలి రోజే రూ. 2.35 లక్షల కోట్ల పెట్టుబడి ప్రణాళికలను ప్రకటించారు. దేశ, విదేశీ దిగ్గజాల నుంచి భారీ పెట్టుబడులను ఆకట్టుకుంటున్న రాష్ట్రాలలో గుజరాత్ ఒకటిగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. వివరాలు చూద్దాం..
రిలయన్స్.. కార్బన్ ఫైబర్ ప్లాంట్
హజీరాలో దేశంలోనే తొలి కార్బన్ ఫైబర్ ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ చీఫ్ ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. గుజరాత్ కేంద్రంగా రిలయన్స్ కార్యకలాపాలు కొనసాగనున్నట్లు తెలియజేశారు. గత దశాబ్ద కాలంలో ప్రపంచస్థాయి ఆస్తులు, సామర్థ్యాలను అభివృద్ధి చేయడంలో దేశవ్యాప్తంగా 150 బిలియన్ డాలర్లు(రూ. 12 లక్షల కోట్లు) వెచ్చించినట్లు వివరించారు. వీటిలో మూడో వంతు పెట్టుబడులను గుజరాత్‌లోనే చేపట్టినట్లు తెలియజేశారు. తద్వారా ఈ ప్రాంతానికి తామిస్తున్న ప్రాధాన్యతను ప్రస్తావించారు.
టాటా.. సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్
ఈ ఏడాది(2024) చివరిలో నూతన సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంటును గుజరాత్‌లో ఏర్పాటు చేయనున్నట్లు టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. దేశీయంగా చిప్స్ తయారీకి ప్రధాని మోడీ ఇస్తున్న ప్రాధాన్యతకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. అంతేకాకుండా ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్ సాణంద్‌లో లిథియమ్ అయాన్ బ్యాటరీల తయారీ కేంద్రానికి తెరతీయనున్నట్లు వెల్లడించారు. ప్రాథమిక దశలో 20 గిగావాట్ స్టోరేజీ బ్యాటరీ సామర్థ్యంతో తయారీ ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. ఎలక్ట్రిక్ వాహనా (ఈవీ)లకు పెరుగుతున్న డిమాండుకు అనుగుణంగా పెట్టుబడులు చేపట్టనున్నట్లు వివరించారు. రెండు దశలలో చేపట్టనున్న ప్రాజెక్ట్ పనులు రెండు నెలల్లోగా ప్రారంభంకానున్నట్లు తెలియజేశారు.
ఆర్సెలర్‌మిట్టల్.. అతిపెద్ద స్టీల్‌ప్లాంట్
ప్రపంచంలోనే ఒకే ప్రాంతంలో అతిపెద్ద స్టీల్ ఫ్యాక్టరీని హజీరాలో ఏర్పాటు చేయనున్నట్లు ఆర్సెలర్‌మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్ పేర్కొన్నారు. జేవీ ఆర్సెలర్‌మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా ద్వారా 2029కల్లా ప్లాంటు నిర్మాణం పూర్తికాగలదని తెలియజేశారు. ప్లాంటును వార్షికంగా 2.4 కోట్ల టన్నుల స్టీల్ తయారీ సామర్థ్యంతో నెలకొల్పనున్నట్లు వెల్లడించారు. 2026లో తొలి దశ ప్రారంభంకావచ్చని తెలియజేశారు.
మైక్రాన్.. రూ. 6,760 కోట్లు
సెమీకండక్టర్ల తయారీలో భారత్‌ను అంతర్జాతీయ కేంద్రంగా నిలపాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలను మైక్రాన్ టెక్నాలజీ సీఈవో సంజయ్ మెహ్‌రోత్రా ప్రశంసించారు. ఈ యూఎస్ చిప్ తయారీ దిగ్గజం సాణంద్‌లో 2.75 బిలియన్ డాలర్ల సెమీకండక్టర్ టెస్టింగ్, ప్యాకేజింగ్ ప్లాంటు నిర్మాణాన్ని సెప్టెంబర్‌లోనే ప్రారంభించింది. పెట్టుబడుల్లో మైక్రాన్ 82.5 కోట్ల డాలర్లు (సుమారు రూ. 6,760 కోట్లు) ఇన్వెస్ట్ చేయనుంది. మిగిలిన నిధులను ప్రభుత్వం రెండు దశలలో సబ్సిడీ రూపంలో సమకూర్చనుంది.
Comments
Please login to add a commentAdd a comment