కాసేపట్లో కీలక ప్రకటన?
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై సాయంత్రం 6 గంటలకు కీలక ప్రకటన వెలువడే అవకాశముందని పలు రాజకీయ వర్గాలు వెల్లడించాయి. జయ అనారోగ్యంపై 6 గంటలకు ముఖ్య ప్రకటన వెలువడనుందని బీజేపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి తెలిపారు. అన్నాడీఎంకే వర్గాలు కూడా ఇదే విషయాన్ని వెల్లడించాయి.
జయలలితకు చికిత్స అందిస్తున్న అపోలో ఆస్పత్రి చుట్టుపక్కల భద్రతను అత్యంత కట్టుదిట్టం చేయడంతో ‘అమ్మ’ మద్దతుదారుల్లో ఆందోళన నెలకొంది. చెన్నైలో 15 వేల మంది పోలీసులను మోహరించారు. ఒక్క అపోలో ఆస్పత్రి వద్దే 5 వేల మంది పోలీసులను దించారు. మరోవైపు సాయంత్రం 6.15 గంటలకు రాయపేటలోని పార్టీ కార్యాలయంలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు మరోసారి భేటీ అవుతున్నారు. అగ్ర నాయకులు తమిళనాడుకు వస్తుండడం అనుమానాలు రేకిత్తిస్తోంది. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు చెన్నైకు వస్తున్నట్టు సమాచారం.
తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పోలీసు అధికారులు విధుల్లోనే ఉండాలని చెన్నై పోలీసు కమిషనర్ ఆదేశించారు. 75 శాతం మంది సిబ్బంది రోడ్లపైనే ఉండాలన్నారు. అన్నిచోట్లా అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు.