తీర్పు విని షాకయ్యా!
అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు విషయం తెలిసి తాను షాకయ్యానని బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రమణ్యం స్వామి తెలిపారు. అయితే తీర్పు పూర్తి కాపీని ఇంకా అధ్యయనం చేయాల్సి ఉందని ఆయన అన్నారు. హైకోర్టు తీర్పును సవాలుచేస్తూ తాను సుప్రీంకోర్టుకు వెళ్తానని కూడా ఆయన స్పష్టం చేశారు. అక్రమాస్తుల కేసులో జయలలితను నిర్దోషిగా తేలుస్తూ కేసును కర్ణాటక హైకోర్టు కొట్టేయడంతో.. ఈ కేసు దాఖలు చేసి, గత 18 ఏళ్లుగా న్యాయపోరాటం చేస్తున్న సుబ్రమణ్యం స్వామి తీర్పు విని దిగ్భ్రాంతికి గురయ్యారు.
మరోవైపు.. కర్ణాటక హైకోర్టు తీర్పుపై డీఎంకే నేతలు కూడా సమాలోచనలు మొదలుపెట్టారు. తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని డీఎంకే వర్గాలు భావిస్తున్నాయి. సాధారణంగా తీర్పును సవాలుచేసే అధికారం తమిళనాడు ప్రభుత్వానికి గానీ, కేసును దర్యాప్తుచేసిన దర్యాప్తు సంస్థ.. అంటే సీబీఐకి గానీ మాత్రమే ఉంటుందని న్యాయనిపుణులు చెబుతున్నారు.