అందుకే.. వాజపేయి ప్రభుత్వాన్ని జయ కూల్చింది!
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో తనకున్న అనుబంధం గురించి, ఆమె రాజకీయ జీవిత విశేషాల గురించి సుబ్రహ్మణ్యస్వామి మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే..
1982లో నేను తొలిసారి జయలలితను కలిశాను. అప్పుడు దివంగత ఎంజీ రామచంద్రన్ సీఎంగా ఉన్నారు. అప్పుడే జయలలిత రాజకీయాల్లో అడుగుపెట్టారు. 34ఏళ్లుగా మేం ఒకరికొకరం తెలుసు. జయలలిత చాలా తెలివైన వ్యక్తి. ఆమె వద్ద ఎంతో జ్ఞానం ఉండేది. జయకు మొండిపట్టుదల, ధైర్యం ఎక్కువ. విషాదమేమిటంటే సినిమా ప్రపంచం ఆమెను కొంత క్రూరంగా మార్చింది. ఆమె సినీ అనుభవాలు అలాంటివి. అవి తర్వాత ఆమె జీవితాన్ని అసంతృప్తిగా విషాదకరంగా మార్చాయి.
నా మేధస్సు, జ్ఞానాన్ని జయలలిత ఎంతగానో ఇష్టపడేవారు. నన్ను ఎంతో ప్రశంసించేవారు. కానీ శశికళా నటరాజన్ విష ప్రభావంతో అదంతా నాశనమైంది. జయలలితపై ఆమెకు పూర్తి పట్టు ఉండేది. మేం ఎప్పుడు కలిసినా, రాజకీయ పొత్తు పెట్టుకున్నా శశికళ దానిని విచ్ఛిన్నం చేసేది. తన వ్యక్తిగత జీవితంలో అసంతృప్తి నెలకొనడంతో జయలలిత శశికళ ప్రభావంలోకి వెళ్లిపోయింది.
నన్ను ఆర్థికమంత్రిని చేయనందుకే..!
1980లో మేం ఇద్దరం రాజ్యసభ సభ్యులుగా పార్లమెంటులో అడుగుపెట్టాం. ఆ సమయంలో సభలో కొన్ని మంచి ప్రసంగాలను జయలలిత చేసింది. 1996లో అన్నాడీఎంకే దారుణంగా ఓడిపోవడంతో జయలలిత దిగ్భ్రాంతికి లోనయింది. 1997లో ఆమె నా ఇంటికి వచ్చి పార్టీని తిరిగి బలోపేతం చేయడానికి, డీఎంకేను, కరుణానిధిని ఎదుర్కోవడానికి నా సాయం అడిగింది. ఆమె విజ్ఞప్తిని అంగీకరించి మేం కూటమి ఏర్పాటుచేశాం. 1998 లోక్‌సభ ఎన్నికల్లో నేను మధురై నుంచి గెలిచాను. జయలలిత కేంద్రంలోని వాజపేయి ప్రభుత్వంలో చేరింది. నన్ను ఆర్థికమంత్రిని చేయమని ఆమె ప్రధాని వాజపేయిని కోరింది. ఈ విషయమై ఏషియన్ ఏజ్ పత్రికలో కథనం కూడా వచ్చింది. అయితే అది జరగలేదు. దీంతో జయలలిత అసంతృప్తికి గురైంది.
వాజపేయి ప్రభుత్వాన్ని కూల్చాలని నిర్ణయించింది. హడావిడిగా తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని నేను సలహా ఇచ్చాను. కానీ వాజపేయి ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిందేనని ఆమె పట్టుబట్టింది. నేను ఒప్పుకోక తప్పలేదు. వాజపేయి ప్రభుత్వాన్ని పడగొట్టాలంటే సోనియాగాంధీతో చేతులు కలుపాల్సి ఉంటుందని ఆమెకు చెప్పాను. ఆమె అందుకు సిద్ధపడింది. దీంతో ఇద్దరి మధ్య నేను గొప్ప టీ పార్టీ మీటింగ్‌ను ఏర్పాటుచేశాను. ఎన్డీఏ ప్రభుత్వం పడిపోయింది. కానీ, సోనియాగాంధీ ఆమెను మోసం చేసింది. అందుకు కారణాలు ఇప్పుడు వెల్లడించలేను. ఆ తర్వాత ఆమె శత్రువు డీఎంకే ఎన్డీయేలో చేరింది. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఆమె అధికారానికి దూరమైంది. ఇది దారుణమైన అనుభవం ఆమెకు. అయినా, 2001లో అద్భుతమైనరీతిలో గెలిచి జయలలిత మళ్లీ సీఎం పగ్గాలు చేపట్టింది.
నన్ను రాష్ట్రపతిని చేయాలనుకుంది!
శశికళ నిందలు వేయడం వల్లే మేం చాలాసార్లు వేరయ్యాం. జయలలిత రాజకీయ కెరీర్‌పై శశికళ విషప్రభావం ఎప్పుడూ కొనసాగింది. 2007లోనూ జయలలిత మళ్లీ నన్ను కలిసింది. నన్ను దేశ రాష్ట్రపతిని చేయాలని ఆమె అనుకుంది. కానీ ఆమె ఆఫర్‌ను నేను తోసిపుచ్చి.. హార్వర్డ్ యూనివర్సిటీలో ఉపాధ్యాయ బాధ్యతలకు ప్రాధాన్యమిచ్చాను. అయితే, నేనంటే చాలామంది రాజకీయ నాయకులు భయం కావడంతో రాష్ట్రపతిగా నేను గెలుస్తానన్న నమ్మకం నాకు అప్పట్లో లేదు. జయలలిత అనంతరం అన్నాడీఎంకే విచ్ఛినం అవుతుంది. పూర్తికాలం ప్రభుత్వాన్ని నడిపే సామర్థ్యం పన్నీర్ సెల్వానికి లేదు.