'స్వామి.. చవకబారు రాజకీయాలు మానుకో'
చెన్నై: రెండు వారాలు గడిచినా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆస్పత్రిలోనే ఉన్నారని అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు, అమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు అమ్మ ఆరోగ్యంపై స్పష్టమైన సమాచారం కావాలని ప్రతిపక్ష పార్టీ డీఎంకే నేతలు డిమాండ్ చేస్తుండటంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. అనారోగ్యం కారణంగా జయలలిత ఆస్పత్రికే పరిమితమవడంతో, తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించాలని కొందరు నేతలు కేంద్రాన్ని కోరుతున్నారు. ఈ విషయంపై సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు డి.రాజా స్పందించారు. జయలలిత చికిత్సకు స్పందిస్తున్నారని, ఆమె కోలుకుంటున్నారని వైద్యులు తెలిపిన విషయాన్ని రాజా ఈ సందర్భంగా గుర్తుచేశారు.
తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించడం సరికాదని ఎంపీ(రాజ్యసభ సభ్యుడు) రాజా అభిప్రాయపడ్డారు. చవకబారు రాజకీయాలు మానుకోవాలని నేత సుబ్రమణ్యస్వామికి ఆయన సూచించారు. తమిళనాడులో రాష్ట్రపతిపాలన విధించాలని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు గత శుక్రవారం విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 22నుంచి చెన్నై అపోలో ఆస్పత్రిలో జయలలిత చికిత్స తీసుకుంటున్నారు. కృత్రిమశ్వాస అందిస్తున్నామని, ఫిజియోథెరపీ చికిత్స చేస్తున్నామని అపోలో వైద్యులు తెలిపారు.