
జాలర్ల సమస్యపై రాజపక్సేను కలవండి
న్యూఢిల్లీ.తమిళనాడుకు చెందిన జాలర్లను శ్రీలంక నావికాదళం తరచూ అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో తగిన పరిష్కారంకోసం శ్రీలంక అధ్యక్షుడు మహీందా రాజపక్సను కలుసుకోవలసిందిగా బీజేపీ నేత సుబ్రమణియం స్వామి మంగళవారం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు సూచించారు. శ్రీలంకలోని జాఫ్నా ప్రాంతాన్ని సందర్శించాలని కూడా ఆయన తన ప్రకటనలో జయలలితనుకోరారు. జాఫ్నా తీరానికి సమీపంలో భారతీయ జాలర్లు చేపలవేట సాగిస్తున్నట్టుగా అక్కడి తమిళులు ఫిర్యాదు చేస్తున్నారని, మన్నార్ సింధుశాఖ ప్రాంతంలో భారతీయ జాలర్లు ప్రతిసారీ అంతర్జాతీయ సరిహద్దును అతిక్రమిస్తున్నారని సుబ్రమణియం స్వామి అన్నారు.
శ్రీలంక ప్రాదేశిక జలాల్లో చేపలవేట సాగించారన్న ఆరోపణలతో ఆరెస్టయి, అక్కడి జైళ్లలో కస్టడీలో ఉన్న జాలర్లను విడుదల చేయించేందుకు స్వయంగా జోక్యం చేసుకోవాలంటూ జయలలిత ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాసిన నేపథ్యంలో జాలర్ల సమస్యపై సుబ్రమణియం స్వామి తాజా ప్రకటన చేశారు.