జయ వారసుడిపై క్లారిటీ?
చెన్నై: అపోలో ఆస్పత్రిలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేల సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం విషమించడంతో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు సోమవారం అత్యవసరంగా అపోలో ఆస్పత్రిలో భేటీ అయ్యారు. ‘అమ్మ’ ఆరోగ్యం అత్యంత ఆందోళనకరంగా ఉన్న నేపథ్యంలో తదుపరి నాయకత్వంపై చర్చించినట్టు సమాచారం. జయ వారసుడిగా పన్నీరు సెల్వం పేరును ప్రతిపాదించినట్టు తెలిసింది. పన్నీరు సెల్వంకు మద్దతుగా ఎమ్మెల్యేలు సంతకాలు చేసినట్టు సమాచారం. గతంలో జయకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినపుడు పన్నీరు సెల్వం తాత్కాలిక ముఖ్యమంత్రిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
‘అమ్మ’ ఆరోగ్యంపై ప్రకటన చేయాలని ఎమ్మెల్యేల సమావేశంలో తీర్మానించారు. అయితే ప్రకటనకు ముందు ఆస్పత్రి వర్గాలు కొన్ని షరతులు పెట్టాయి. వీటిపై ఎమ్మెల్యేల సంతకాలు తీసుకున్నాయి. జయ ఆరోగ్య పరిస్థితిని ఎమ్మెల్యేలకు వైద్యులు వివరించారు. తాము ఎంత కష్టపడ్డా జయ ఆరోగ్యం విషమంగానే ఉందని తెలిపారు. ఆమెకు అత్యుత్తమ వైద్యం అందిస్తున్నామని చెప్పారు. మరోవైపు అపోలో ఆస్పత్రికి వెళ్లే దారులన్నింటినీ మూసివేశారు. కాగా, సాయంత్రం 6.15 గంటలకు మరోసారి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు భేటీ కానున్నారు. రాయపేటలోని పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది.