న్యూఢిల్లీ: ఎన్నికైన ప్రజాప్రతినిధులు కూడబెట్టే మితిమీరిన ఆస్తులపై సమీక్షకు శాశ్వత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలన్న ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇందుకు సంబంధించి రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ పదవీకాలంలో విపరీతంగా ఆస్తులు సంపాదించుకుంటూ ఎన్నికల్లో ప్రభావం చూపుతున్నారనీ, ఇటువంటి ధోరణులకు అడ్డుకట్ట పడేందుకు నామినేషన్ల సమయంలోనే వారు తమ ఆస్తుల వివరాలు వెల్లడించేలా శాశ్వత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలంటూ ‘లోక్ ప్రహరీ’ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో గతంలో పిటిషన్ వేసింది.
‘ప్రజా ప్రతినిధులు పదవీ కాలంలో అతిగా ఆస్తులు కూడబెట్టుకోవడం ప్రజాస్వామ్యం విఫలమైందనడానికి గట్టి సూచిక’ అని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇటువంటి ధోరణులను నివారించేందుకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎన్నికల నామినేషన్ల సమయంలోనే తమ ఆస్తుల వివరాలు, ఆదాయ మార్గాలు వంటి వాటిని ధ్రువీకరించాలని, దీనిని బట్టి పదవీ కాలంలో వారు ఎలాంటి ఆస్తులు కూడబెట్టిందీ సమీక్షించేందుకు వీలుంటుందని పేర్కొంది. ఇందుకోసం ప్రభుత్వం వెంటనే ఒక శాశ్వత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ప్రభుత్వం చర్యలు తీసుకోలేదంటూ ‘లోక్‌ప్రహరీ’ కోర్టు ధిక్కార పిటిషన్ వేసింది. దీనిపై ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది.
ఈసీపై ధిక్కార పిటిషన్
న్యూఢిల్లీ: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులంతా తమ నేర చరిత్రను బహిర్గతం చేయాలన్న తమ ఆదేశాలను అమలు చేయనందుకు కేంద్రంతోపాటు ఈసీపై ధిక్కార నేరం కింద సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. ‘ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు తమ నేర చరిత్రను ఈసీకి వెల్లడించాలి. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఆ వివరాలివ్వాలి’ అంటూ గత ఏడాది రాజ్యాంగ ధర్మాసనం ఆదేశాలిచ్చింది. ఇటీవలి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల సందర్భంగా కేంద్రం, ఈసీ ఆ ఆదేశాలను పట్టించుకోలేదంటూ ఓ లాయర్ వేసిన పిటిషన్‌పై గురువారం ప్రత్యేక ధర్మాసనం వాదనలు వింటుందని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. ఈ పిటిషన్ ప్రతిని ఎన్నికల సంఘం కార్యదర్శికి అందజేయాలని కూడా ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment