ఇవే మోదీ డిగ్రీలు.. చూసుకోండి
మీడియా ముందుకు తెచ్చిన అమిత్ షా, జైట్లీ
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ బీఏ, ఎంఏ డిగ్రీల పట్టాలను బీజేపీ బహిర్గతం చేసింది. బీజేపీ)అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం వాటిని మీడియా ముందు ప్రదర్శించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. మోదీ విద్యార్హతల వివరాల కోసం ఆర్టీఐ దరాఖాస్తు చేసుకోవడం.. ఆ వివరాలు అందక ముందే ఓ గుజరాత్ పత్రికలో ఈ విషయం వెల్లడి కావడం తెలిసిందే. దీనిపై కేజ్రీ అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో షా, జైట్లీ మీడియా సమావేశం పెట్టి మరీ ప్రధాని డిగ్రీల వివరాలు వెల్లడించారు. ఢిల్లీ వర్సిటీ నుంచి తీసుకున్న బీఏ , గుజరాత్ వర్సిటీ నుంచి తీసుకున్న ఎంఏ డిగ్రీలను ప్రదర్శించారు. మోదీపై కేజ్రీ అసత్య ఆరోపణలు చేశారన్నారు. ప్రధాని విద్యార్హతలపై దిగజారుడు వ్యాఖ్యలు చేసిన కేజ్రీ ఇప్పుడు మోదీకే కాకుండా దే శ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
అవన్నీ నకిలీ పత్రాలే: కేజ్రీవాల్
అయితే బీజేపీ నేతలు విడుదల చేసిన ప్రధాని డిగ్రీలన్నీ నకిలీవేనని, ఫోర్జరీ సంతకాలతో కూడినవని ఆప్ నేత కేజ్రీవాల్ ట్వీటర్‌లో పోస్ట్ చేశారు. మోదీ డిగ్రీల అసలు పత్రాలు ఢిల్లీ వర్సిటీ (డీయూ) వద్ద సీల్ చేసి ఉన్నాయని... బీజేపీ నేతలు ఫోర్జరీ పత్రాలను చూపిస్తున్నారన్నారు. ఆప్ మరో నేత ఆశుతోష్ మాట్లాడుతూ తన వద్ద ఉన్న మోదీ విద్యార్హతల కాపీలకు, షా చూపించిన వాటికి తేడా ఉందని.. దీంతో అవి నకిలీవని తేలిందని అన్నారు. మోదీ పేరు బీఏ, ఎంఏ డిగ్రీల మార్క్‌షీట్లలో తేడాగా ఉందన్నారు. బీఏ పార్ట్ -1లో ‘నరేంద్ర కుమార్ దామోదర్‌దాస్ మోదీ’ అని ఉండగా.. సెకండియర్ మార్క్‌షీట్‌లో ‘నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ’ అని ఉందన్నారు. కాగా మోదీ ఎం.ఎ. డిగ్రీ తొలి ఏడాదిలో తన పేరును నరేంద్రకుమార్ దామోదర్‌దాస్ మోదీగా పేర్కొన్నారని గుజరాత్ వర్సిటీ తెలిపింది. రెండో సంవత్సరంలో పేరులోని కుమార్‌ను తీసేసి నరేంద్ర దామోదర్‌దాస్ మోదీగా మార్చుకున్నారంది.