ఈనెలలోనే 'మూడు'
పార్లమెంటు సమావేశాల తర్వాత థర్డ్‌ఫ్రంట్‌కు రూపురేఖలు
కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీల భేటీ
సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్
కోల్‌కతా: మూడో కూటమికి ఈనెలలోనే రూపురేఖలు ఏర్పడనున్నాయని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ చెప్పారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత ఢిల్లీలో కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలు భేటీ కానున్నాయని, ఆ భేటీలో మూడో కూటమిని ప్రకటించనున్నాని తెలిపారు. కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ మైదానంలో ఆదివారం పశ్చిమ బెంగాల్ లెఫ్ట్‌ఫ్రంట్ నిర్వహించిన ర్యాలీలో కారత్ మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే, నయా సరళీకరణ విధానాలను మరింత ముమ్మరంగా అమలులోకి తెస్తుందని, ఫలితంగా కార్పొరేట్ సంస్థలకు దేశాన్ని దోచుకునేందుకు మరింత అవకాశం లభించి, వాటికి లాభాల పంట పండుతుందని అన్నారు. అదే సమయంలో దేశ ప్రజల నడుమ మతపరమైన చీలికలు పెరుగుతాయని హెచ్చరించారు. మతతత్వ శక్తులను కట్టడి చేయడంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో రానున్న ఎన్నికల్లో మూడో ప్రత్యామ్నాయం ప్రజల ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్, బీజేపీలతో పోరాడేందుకు కాంగ్రెసేతర, బీజేపీయేతర లౌకికవాద పార్టీలు, వామపక్షాలు ఏకతాటిపైకి రానున్నాయని అన్నారు.
ఇంకా మొదటి తరగతిలోనే మోడీ...
మూడో కూటమితో దేశం అధోగతికి చేరుతుందని కోల్‌కతాలోని ఇదేచోట బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై కారత్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మోడీ నిజమే చెప్పారని, మొదటి తరగతి కంటే మూడో తరగతే పెద్దదని, అయితే, మోడీ ఇంకా మొదటి తరగతిలోనే ఉన్నారన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్, ఒడిశా, బీహార్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటకలలో మోడీ, బీజేపీలు ఎక్కడ ఉంటాయో తెలిసిపోతుందన్నారు. యూపీఏ కూటమి నుంచి వైదొలగిన సీఎం, తృణమూల్ అధినాయకురాలు మమతా బెనర్జీకి మోడీ ఆహ్వానం పలకడం సహజ పరిణామమేనని, ఆమె బీజేపీతో చేతులు కలిపే సమయం ఆసన్నమైందని కారత్ వ్యాఖ్యానించారు.