జమ్మూ: సరిహద్దులో పాకిస్థాన్ ఆర్మీ బరితెగిస్తోంది. కాల్పుల విరమణ ఉల్లంఘనలో శ్రుతిమించిపోతోంది. సోమవారం ఒక్కరోజే పాక్ ఆర్మీ జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్, సాంబా జిల్లాల్లో భారత ఆర్మీ ఔట్‌పోస్టులపై మూడు పర్యాయాలు కాల్పులకు తెగబడింది. మోర్టార్లు, రాకె ట్లను భారీగా ప్రయోగించింది. భారత సైనికులు వీటిని అంతే దీటుగా తిప్పికొట్టారు. ఇరు పక్షాల మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి. పాక్ గత మూడు రోజుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ఇది ఏడోసారి. ఆ దేశ బలగాలు ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం 6 గంటల మధ్య పూంచ్ సరిహద్దు, దిగావర్, మాన్‌కోటే, దుర్గా బెటాలియన్ ప్రాంతాల్లోని 11 పోస్టులపై భారీ కాల్పులు జరిపాయి.
సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో సాంబాలోని కోతాయ్ ఔట్ పోస్టుపై, రాత్రి 9.20 ప్రాంతంలో పూంచ్‌లోని మెంధార్ సబ్ సెక్టార్ పోస్టుపై కాల్పులకు పాల్పడ్డాయి. బీఎస్‌ఎఫ్ జవాన్లు పాక్ సైనికులకు గట్టి సమాధానమిచ్చారు. తమ వైపు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని భారత ఆర్మీ అధికారులు తెలిపారు. మరోపక్క.. భారత ఆర్మీ తమ అధీనంలోని కాశ్మీర్(పీఓకే)లో కాల్పులు జరపడంతో ఒక పౌరుడు చనిపోయాడని పాక్ విదేశాంగ శాఖ ఆరోపించింది. ఇస్లామాబాద్‌లోని భారత డిప్యూటీ హై కమిషనర్ గోపాల్ బాగ్లేను పిలిపించుకుని నిరసన తెలిపింది.
ఒకేరోజు మూడుసార్లు ఉల్లంఘన
Published Tue, Aug 13 2013 6:39 AM | Last Updated on Fri, Sep 1 2017 9:49 PM
Advertisement
Advertisement