ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. ఈ సంఘటన సరిహద్దు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లాలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. సుకుమా జిల్లాలోని గాధీరాజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గల అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సీఆర్‌పీఎఫ్, డీఆర్‌జీ, ఛత్తీస్‌గఢ్ ఆర్మ్‌డ్ ఫోర్స్‌లు సంయుక్త ఆపరేషన్ చేపట్టాయి.
ఈ క్రమంలో బాడిశెట్టి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో తారసపడిన మావోయిస్టులు బలగాలపైకి కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన బలగాలు ఎదురుకాల్పులు జరపడంతో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. వారిలో పంచాయతీ కమిటీ ప్రెసిడెంట్ పొడియం సోనాల్, డీఏకేఎంఎస్ ప్రెసిడెంట్ కలుము ఇడమతోపాటు మిలీషియా కమిటీ సభ్యుడు ఉన్నారు. కాల్పులు జరిగిన ప్రాంతం నుంచి మృతదేహాలతోపాటు మూడు బర్మార్ తుపాకీలు, ఒక టిఫిన్ బాంబును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.