రక్తమోడిన రహదారులు
సాక్షి, ముంబై: రహదారులు రక్తమోడుతున్నాయి. పరిమితికి మించిన వేగంతో ప్రయాణిస్తూ అంతే వేగంగా మృత్యువు ఒడిలోకి చేరుతున్నారు. వేగంగా దూసుకువచ్చిన ఓ కారు భారీ కంటెయినర్‌ను ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన ఠాణేలోని కాశేలీ వంతెన సమీపంలో బుధవారం ఉదయం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం... ఉదయం నాలుగు గంటల సమయంలో కారేగావ్ టోల్‌ప్లాజా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
దీనిని గమనించిన అగ్నిమాపక సిబ్బంది, విపత్తుల నియంత్రణ బృందం ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. అయితే అప్పటికే ముగ్గురు మృత్యువాత పడగా చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఓ వ్యక్తిని నుజ్జునుజ్జయిన కార్లో నుంచి బయటకు తీశారు. మృతిచెందినవారిని వికీ పింటో అమ్రోజ్(34), కబీర్ అరోరా(25), అనుజ్ దిఘే(32)గా గుర్తించారు. మరో వ్యక్తి అజిత్ పరబ్ గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
హింగోలి సమీపంలో ఇద్దరు...
నాందేడ్ సమీపంలోని హింగోలి ప్రాంతంలో బుధవారం ఉదయం కారు బోల్తాపడిన ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు. వారి ముఖాలకు తీవ్రగాయాలు కావడంతో గుర్తించడానికి వీలులేకుండా పోయిందని నాందేడ్ జిల్లా పోలీసులు చెప్పారు. మధ్యప్రదేశ్‌కు చెందిన కారులో ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తుండగా అది అదుపుతప్పి లోయలో పడిపోయింది. కారులో సోదా చేయగా గంజాయి లభించిందని పోలీసులు తెలిపారు. అయితే వీరి కారును ఎవరో వెంబడిస్తుండవచ్చని, తప్పించుకునే ప్రయత్నంలో వేగంగా వెళుతూ ప్రమాదానికి గురై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటన స్థలానికి 100 మీటర్ల దూరంలో ఒకరి మృతదేహం లభించింది. దీన్ని బట్టి ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో జరిగిందో తెలుస్తోందని పోలీసులు చెప్పారు.