నాగాలాండ్‌లో ఎన్‌కౌంటర్
ఆర్మీ మేజర్‌తో పాటు ముగ్గురు ఉగ్రవాదులు మృతి
కోహిమా: నాగాలాండ్‌లోని మొన్ జిల్లాలోని లప్పా గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ దాడిలో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందగా..భారత సైన్యాని కి చెందిన ఓ మేజర్ అమరులయ్యారు. నేష నలిస్ట్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాం డ్ (ఎన్‌ఎస్‌సీఎన్–కే), ఉల్ఫా ఉగ్రవాదుల కార్యకలాపాలపై భద్రతా బలగాలకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో భారత సైన్యంతో పాటు 12 పారాచూట్ రెజిమెంట్ అస్సాం రైఫిల్స్‌తో కలిసి సంయుక్త ఆపరేషన్ నిర్వహించాయి. అయితే భద్రతా బలగాల కదలికల్ని పసిగట్టిన ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. ఈ దాడిలో భారత సైన్యానికి చెందిన మేజర్ డేవిడ్ మన్‌లున్ అమరులయ్యారు. ప్రతిగా భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదుల్ని హతమార్చాయి. సంఘటనా స్థలం నుంచి ఓ ఏకే–56 రైఫిల్‌తో పాటు రెండు చైనా తయారీ గ్రెనేడ్లు, మూడు ఐఈడీలు, 270 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.