ముగ్గురు మహిళల ఆత్మహత్య
రాయగడ : రాయగడ జిల్లాలో ఇద్దరు వివాహిత కుమార్తెలతో అంగన్‌వాడీ కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడింది. వార్డు సభ్యురాలితో విభేదాలు, ఏడీఎం వేధింపులు కారణమని కొందరు పేర్కొన్నారు. కాగా, కుటుంబ కారణాలు కారణమని కొందరు పేర్కొన్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. అంగన్‌వాడీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
జాజ్‌పూర్ జిల్లా గుమ్మ గ్రామానికి చెందిన ఉత్పల సుఖల కల్యాణసింగుపురం సమితి సికరపాయి గ్రామ పంచాయతీ బెల్‌కోన గ్రామంలో అంగన్‌వాడీ వర్కర్‌గా పని చేస్తున్నారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు పింకి సుఖల, రింకి సుఖల. వారికి వివాహమైంది. పింకి సుఖలకు నాలుగేళ్ల కుమార్తె ఉంది. అంగన్‌వాడీ వర్కర్ ఉత్పల సుఖలకు బెల్‌కోనలో వార్డు సభ్యురాలైన సుశీల మండంగికి మధ్య విభేదాలు ఉన్నాయి. గ్రామ కల్యాణ సమితి నిధులకు సంబంధించి విభేదాలు తలెత్తాయని తెలిసింది. ఈ నేపథ్యంలో ఉత్పల ఇద్దరు వివాహిత కుమార్తెలతో ఆదివారం తెల్లవారుజామున విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం తెలిసిన వెంటనే కల్యాణసింగుపురం పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
ఆత్మహత్యపై పలు అనుమానాలు
ఉత్పల, ఇద్దరు కుమార్తెల ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వార్డు సభ్యురాలితో విభేదాలు ఉండడమే కారణమైతే ఆమె ఒక్కర్తే ఆత్మహత్యకు పాల్పడి ఉండేదని కొందరు అభిప్రాయపడ్డారు. జిల్లా ఏడీఎం వేధింపులు కారణమని కొందరు ఆరోపించారు. అంగన్‌వాడీ వర్కర్‌గా రాజీనామా చేయాలని ఉత్పలపై ఏడీఎం ఒత్తిడి తేవడంతో ఆత్మహత్యకు పాల్పడిందని ఈ ఘటనపై విచారణ చేపట్టిన ఎస్‌డీపీఓ వై.జగన్నాథం, తహసీల్దార్ గౌరచరణ్ పట్నాయక్, బీడీవో ప్రవీణ్‌కుమార్‌కు స్థానికులు చెప్పినట్లు తెలిసింది. వార్డు సభ్యురాలితో విభేదాలు, అధికారుల వేధింపులు ఆత్మహత్యకు కారణం కాకపోయి ఉండవచ్చునని, కుటుంబంలో ఏదో సమస్య తలెత్తి ఉంటుందని భావిస్తున్నారు. కుటుంబ కారణాలతోనే వారు ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు.
పరిహారం చెల్లించాలని ఆందోళన
ఉత్పల, ఇద్దరు కుమార్తెల ఆత్మహత్యతో పింకి సుఖల నాలుగేళ్ల కుమార్తె అనాథగా మిగిలింది. వారి మృతిపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తూ అంగన్‌వాడీ కార్యకర్తలు బెల్‌కోనలో రాస్తారోకో నిర్వహించారు. రూ.20 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.