
మరిన్ని దాడులు చేస్తాం: కేంద్ర మంత్రి
పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) లో భారత్ చేసింది ఆర్మీ చర్యగా చూడరాదని, కేవలం ఆత్మరక్షణ కోసం చేసిన దాడులుగా పరిగణించాలని కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ పేర్కొన్నారు. రక్షణ కోసం అవసరమైతే భారత ఆర్మీ ఎన్ని దాడులకైనా సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ఇటీవల జమ్ముకశ్మీర్ లోని ఉడీ దాడుల్లో 18 మంది భారత జవాన్లు అమరులయ్యారు. అందుకు ప్రతీకారంగా భారత్ ఆత్మరక్షణ చర్యలు చేపట్టిందన్నారు. అందులో భాగంగానే తాజాగా పీఓకేలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్ దాడికి ప్రణాళికలు రూపొందించారని పేర్కొన్నారు.
పీఓకే భారత్‌దే, మరీ ఉల్లంఘనెక్కడిది?
పీఓకేలో ఎలాంటి ఉల్లంఘటనలకు పాల్పడలేదని, ఎందుకంటే పీఓకే భారత్ లో అంతర్భాగమేనని ఆయన వ్యాఖ్యానించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని ఉగ్రవాద శిబిరాలపై 'నిర్దేశిత దాడుల' (సర్జికల్ స్ట్రైక్స్) విషయంలో భారత్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. పీవోకే పాక్ నియంత్రణలో ఉన్నా.. అధికారికంగా ఇది భారత్ భూభాగంలో ఉన్నట్టే లెక్క. కాబట్టి ఈ ప్రాంతంలో దాడులు జరిపినా.. సరిహద్దుల ఉల్లంఘన, ప్రాదేశిక ఉల్లంఘన కిందకి రాదు. కాబట్టి ఈ విషయంలో ఎలాంటి ఉల్లంఘన జరగలేదని కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ మీడియాకు వెల్లడించారు. కేవలం కొంతమంది ఉగ్రవాదులను అంతం చేయడమే ఈ దాడుల లక్ష్యమని, అంతేకానీ మిలటరీ చర్యగా భావించవద్దని పాక్ కు సూచించారు. పీఓకేలో భారత ఆర్మీ నిర్దేశిత దాడులలో దాదాపు 38 మంది ఉగ్రవాదులు హతమైన విషయం తెలిసిందే.