తోమర్ లా డిగ్రీ నకిలీది
హైకోర్టుకు తెలిపిన వర్సిటీ
న్యూఢిల్లీ: రైతు గజేంద్రసింగ్ ఆత్మహత్య వ్యవహారంలో ఇబ్బంది ఎదుర్కొన్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఇప్పుడు మరో సంకటం. కేజ్రీవాల్ మంత్రివర్గంలోని న్యాయ మంత్రి జితేందర్ సింగ్ తోమర్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన విద్యార్హత సర్టిఫికెట్ నకిలీదనే విషయం దుమారం రేపుతోంది. తోమర్ తాను బిహార్‌లోని తిల్కమాంఝి భాగల్పూర్ వర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందినట్లు బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదు చేయించుకున్నారు.
ఈ సర్టిఫికెట్ నకిలీదని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా కోర్టు వర్సిటీ వివరణ కోరింది. తోమర్ సర్టిఫికెట్ సంఖ్య3687. అయితే ఇదే నంబరుతో 1999లో సంజయ్ అనే వ్యక్తికి తాము బీఏ పట్టా ఇచ్చామని వర్సిటీ సోమవారం హైకోర్టుకు తెలిపింది. తోమర్ సర్టిఫికెట్ నకిలీదని పేర్కొంది. తోమర్ కేజ్రీవాల్‌ను కలిసి సర్టిఫికెట్ అసలైందని చెప్పారు.