
ప్రధాని మోదీతో భేటీకానున్న తమిళనాడు సీఎం
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీరు సెల్వం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. సోమవారం ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశంకానున్నారు.
జయలలితకు భారతరత్న అవార్డు ఇవ్వాలని పన్నీరు సెల్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నారు. ఆమెకు దేశ అత్యున్నత పౌరపురస్కారం ఇవ్వాల్సిందిగా కేంద్రానికి సిఫారసు చేయాలని ఇటీవల తమిళనాడు కేబినెట్ తీర్మానించిన సంగతి తెలిసిందే. అలాగే పార్లమెంట్‌లో జయ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మోదీని తమిళనాడు సీఎం కోరనున్నారు. ఇటీవల తుఫాను కారణంగా రాష్ట్రానికి కలిగిన నష్టంపై సాయం చేయాల్సిందిగా విన్నవించనున్నారు.
జయలలిత మరణించిన రోజు రాత్రి పన్నీరు సెల్వం సీఎంగా ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ చెన్నైకు వెళ్లి జయలలిత భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన శశికళను, సెల్వంను ఓదార్చారు. ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని ప్రధాని వారికి భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో పన్నీరు సెల్వం ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.