కొద్దిలో భారీ ప్రమాదం తప్పింది
లక్నో: ఉత్తరప్రదేశ్లో రెండు రైళ్లకు పెను ప్రమాదం తప్పింది. ఎదురెదురుగా రెండు రైళ్లు ఒకే ట్రాక్పై దూసుకొచ్చాయి. రెండు ట్రెయిన్ ల డ్రైవర్లు వేగంగా స్పందించడంతో సరిగ్గా 150 మీటర్ల దూరంలో రెండు రైళ్లు ఆగిపోయాయి. లేదంటే భారీ ప్రాణ, ఆస్తి నష్టం చూడాల్సి వచ్చేంది. సాంకేతిక లోపం తలెత్తడం వల్లే ఈ ప్రమాదం జరిగేందుకు ఆస్కారం చోటుచేసుకుందని ఉత్తర రైల్వే అధికారులు చెప్పారు. విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు.
చర్బాంగ్ రైల్వే స్టేషన్కు సరిగ్గా రెండు కిలో మీటర్ల దూరంలో దిల్ఖుషా క్యాబిన్ ఏరియా వద్ద ఒకే ట్రాక్పై రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చాయి. వాస్తవానికి ఆ రైళ్ల ట్రాక్లు మార్చేది దిల్ ఖుషా క్యాబిన్ వద్దే. అయితే, ట్రాక్ మార్చే ప్రయత్నం చేసినప్పటికీ సాంకేతిక లోపం తలెత్తి అలా జరగలేదు. అప్పటికే అవతలి వైపునుంచి వస్తున్న రైలు భారీ వేగంతో వస్తోంది. దీంతో అవతలి నుంచి వచ్చే రైలు.. ఈ రైలు ఒకే ట్రాక్పైకి దూసుకెళ్లాయి. రెండు రైళ్ల డ్రైవర్లు ఇది గమనించి అత్యవసర బ్రేక్లు వేయడంతో పట్టాలపై భారీ శబ్దం చేస్తూ అవి ఆగిపోయాయి. దీంతో అందులోని ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.