మారన్‌ల చుట్టూ మళ్లీ ఉచ్చు
ఎయిర్‌సెల్–మ్యాక్సిస్ కేసులో ఢిల్లీ హైకోర్టు విచారణ
- అక్రమాలు జరిగినట్లు బలమైన సాక్ష్యాలున్నాయన్న ఈడీ
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్, అతని సోదరుడు కళానిధి మారన్‌లకు మళ్లీ ఎయిర్‌సెల్–మ్యాక్సిస్ కేసు ఉచ్చు బిగుసుకోనుంది. ఈ కేసునుంచి మారన్ సోదరులకు విముక్తి కల్పించిన ప్రత్యేక కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గతవారం ఢిల్లీ హైకోర్టును సంప్రదించింది. వారి అక్రమాలకు సంబంధించి బలమైన సాక్ష్యాధారాలున్నాయని తెలిపింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన జస్టిస్ ఎస్‌పీ గార్గ్.. ఈడీ పిటిషన్‌పై నాలుగువారాల్లోగా సమాధానం ఇవ్వాలని మారన్ సోదరులతోపాటు ఐదుగురికి నోటీసులు జారీచేశారు.
దయానిధి, కళానిధి, కావేరీ కళానిధి (ఎస్‌ఏఎఫ్‌ఎల్), ఈ సంస్థ ఎండీ షణ్ముగం, సన్ డైరెక్ట్ టీవీలకు నోటీసులిచ్చారు. ఫిబ్రవరి నాటి తీర్పులో ఈడీ, సీబీఐ వేసిన కేసులను ప్రత్యేక కోర్టు తోసిపుచ్చింది. ఎయిర్‌సెల్–మ్యాక్సిస్ ఒప్పందంతో మారన్ సోదరులతోపాటు మిగిలిన వారికి సంబంధం లేదని తీర్పునిచ్చింది. తాజా పిటిషన్‌లో ఈ కేసుకు సంబంధించిన కార్పొరేట్ ప్రముఖుల అక్రమాలపై ఇచ్చిన వివరాలను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని ఢిల్లీ హైకోర్టుకు ఈడీ తెలిపింది. ‘కళానిధి, కావేరిలు, మారన్ గ్రూప్ కంపెనీలు ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డట్టు స్పష్టమైన ఆధారాలున్నాయి’ అని పేర్కొంది. ప్రత్యేక కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఈడీ మొదట సుప్రీంకోర్టును సంప్రదించింది.
కార్తీపై ఈడీ కేసు
మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం కొడుకు కార్తీ చిదంబరంపై ఈడీ శుక్రవారం మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో నిందితులుగా పేర్కొన్న కార్తీ, ఐఎన్‌ఎక్స్ మీడియా, దాని డైరెక్టర్లు పీటర్, ఇంద్రాణి ముఖర్జియా, ఇతరులపై పోలీస్ ఎఫ్‌ఐఆర్‌తో సమానమైన ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్‌ను నమోదు చేసింది. కార్తీకి ఐఎన్‌ఎక్స్ అక్రమంగా చెల్లింపులు చేసిందని ఈడీ తొలుత సమాచారం వెల్లడించడంతో ఈ కేసులో సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదుచేసింది.