ఆందోళన చేస్తున్న ఖెందుగుడ గ్రామస్తులు
జయపురం ఒరిస్సా : తమ వ్యవసాయ భూములకు పట్టాలు ఇవ్వాలని నవరంగపూర్ జిల్లాలోని పడహండి సమితి ఖెందుగుడ గ్రామ గిరిజనులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో నవరంగపూర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మంగళవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ ప్రాంత పరిధిలోని తమ పంట భూములకు పట్టాలు పంపిణీ చేసి, భద్రత కల్పించాలని గిరిజనులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పట్టాలపై ఆంక్షలు విధించడాన్ని విడనాడాలంటూ నినాదాలు చేశారు. కొంతమంది అధికారులు అటవీ భూమి చట్టాలను ఉల్లంఘన చేస్తున్నారని ఆరోపించారు. బీఎస్‌ఎస్ చట్టాలను రద్దు చేసి, వ్యక్తిగత అటవీ అధికారం ప్రజలకు అప్పగించాలని కోరారు. అటవీ విభాగం అధికారులు అటవీ చట్టాలను తుంగలోకి తొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలకు చెందిన చట్టపరమైన అధికారాలను కూడా కాలరాస్తున్నారని దుయ్యబట్టారు.
ఈ సందర్భంగా గిరిజనులు కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. గతంలో జరిగిన అనేక గ్రీవెన్స్ సెల్‌లలో పట్టాల కోసం పలు విజ్ఞప్తులు చేసినా సంబంధిత అధికారులు పట్టించుకోలేదని ఆవేదనవ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, న్యాయం చేయాలని కోరారు.
వ్యక్తిగత భూముల్లో మొక్కలు నాటారు
రెండు నెలల క్రితం అటవీ విభాగం అధికారులు ఖెందుగుడ గ్రామంలోని సుమారు 3 వందల ఎకరాల అటవీ భూముల్లో బీఎస్‌ఎస్ కమిటీతో కలిసి మొక్కలు నాటి, కంచె వేశారన్నారు. దీంతో తమ భూములు కూడా కొన్ని అందులో ఉండిపోవడంతో వ్యవసాయం చేసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పాటు అదే భూమిలో గిరిజనుల వ్యక్తిగత భూములతో పాటు ప్రభుత్వ ఆస్తులైన శ్మశానవాటిక, సామాజిక అడవులు, పూజా స్థలాలు కొన్ని ఉన్నాయన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా అటవీ అధికారులు మొక్కులు నాటడాన్ని పలువురు తప్పుబట్టారు. ఇదే విషయంపై జిల్లా అటవీ అ«ధికారులకు ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వీరితో పాటు ఉమ్మరకోట్ తహసీల్దార్, బీడీఓ, జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా కలెక్టర్‌లకు పలుమార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదని వాపోయారు.
తమ సమస్యలను పట్టించుకోవాల్సిన అధికారులే పట్టించుకోకపోవడంతో ఆందోళనకు దిగాల్సి వచ్చిందని, బాధితులు పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. లేకపోతే పెద్ద స్థాయిలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఆందోళనలో జెమా శాంత, సీతారాం శాంత, వార్డు సభ్యుడు బుధా శాంత, గిరిజనులు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment