
న్యూఢిల్లీ: మూడుసార్లు తలాక్ చెప్పడం ద్వారా విడాకులిచ్చే వివాదాస్పద ఇస్లాం ఆచారం ట్రిపుల్ తలాక్‌ను నిషేధిస్తూ వచ్చే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. తక్షణ ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణించేలా తగిన చట్టం రూపొందించడం లేక నేర శిక్షాస్మృతిలో ప్రస్తుతమున్న నిబంధనలను సవరించేలా బిల్లును ప్రతిపాదించడానికి మంత్రుల కమిటీని నియమించినట్లు ప్రభుత్వ అధికారులు మంగళవారం వెల్లడించారు.
ప్రస్తుతమున్న చట్టం ప్రకారం బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించాల్సి ఉంటుంది. మత గురువులు కూడా ఆమెకు ఎలాంటి సాయం చేసే స్థితిలో లేరు. ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధం అంటూ సుప్రీంకోర్టు దాన్ని ఆగస్టులోనే కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఈ విధానం ద్వారా ఇంకా విడాకులు ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అవగాహనలేమి, ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు ఇచ్చిన వారిని కఠినంగా శిక్షించేలా తగిన చట్టం లేకపోవడమే దీనికి కారణాలుగా భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment