సాక్షి, న్యూఢిల్లీ: జనాభా దామాషా ప్రకారం ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్ల కోటా పెంచాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఆయా రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌లో చేర్చాలంటూ శుక్రవారం పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్ ఆందోళన చేపట్టింది. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు విపక్షాలన్నీ బలాన్ని సమకూర్చగా టీఆర్‌ఎస్, ఏఐఏడీఎంకే మాత్రం వెల్‌లో ఉండి తమ పోరాటాన్ని కొనసాగించాయి.
50 శాతానికి మించి రిజర్వేషన్లను పెంచుకునేందుకు రాష్ట్రాలకు అధికారం కట్టబెట్టాలని, ఒక దేశంలో ఒకే విధానం ఉండాలని టీఆర్‌ఎస్ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించారు. అంతకుముందు పార్లమెంటు ప్రధాన ద్వారం వద్ద బైఠాయించారు. ఎంపీలు కె.కేశవరావు, జితేందర్‌రెడ్డి, కవిత, బి.వినోద్‌కుమార్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, బాల్క సుమన్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, పసునూరి దయాకర్ పాల్గొన్నారు. జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘ఒక దేశంలో ఒకే విధానం ఉండాలి.
తమిళనాడులో రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌లో చేర్చి వేరే రాష్ట్రాల రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌లో ఎందుకు పెట్టరు. ఉపాధి హామీ పథకంలో కోట్లాది రూపాయలు వ్యర్థంగా పోతున్నందున ఈ పథ కాన్ని రైతులతో అనుసంధానం చేయండి. గిట్టుబాటు ధర కోసం రెండు వారాలుగా మేం పట్టుబడుతున్నాం. కానీ ప్రభుత్వం స్పందించట్లేదు’అని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడటమే తప్పు అన్నట్లు అశోక్‌గజపతి రాజు, వై.ఎస్.చౌదరి గురువారం సభలో మాట్లాడటం నచ్చలేదని వినోద్ కుమార్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment