
సాక్షి, న్యూఢిల్లీ: రిజర్వేషన్ల అమలుపై పూర్తి అధికారాన్ని రాష్ట్రాలకు కట్టబెట్టేలా ఆర్టికల్ 16 (4)ను సవరించాలంటూ టీఆర్‌ఎస్ ఎంపీలు మంగళవారం పార్లమెంటులో ఆందోళన చేశారు. వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. అయితే అదే సమయంలో టీఆర్‌ఎస్‌తోపాటు వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ, ఏఐఏడీఎంకే, కాంగ్రెస్ పార్టీలు వివిధ అంశాలపై ఆందోళన చేయడంతో గందరగోళం నెలకొంది. దీంతో సభాపతి సుమిత్రా మహాజన్ కొద్దినిమిషాలకే సభను వాయిదా వేశారు. తిరిగి 12 గంటలకు సభ ప్రారంభమైనా ఆందోళనలతో సభాకార్యక్రమాలు స్తంభించాయి. చివరికి సభను బుధవారానికి వాయిదా వేశారు.
గాంధీ విగ్రహం వద్ద ధర్నా..
అంతకుముందు ఉదయం 10.30 గంటలకు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద టీఆర్‌ఎస్ ఎంపీలు ధర్నా చేశారు. పార్టీ లోక్‌సభాపక్ష నేత జితేందర్‌రెడ్డి, ఎంపీలు వినోద్‌కుమార్, కవిత, బూర నర్సయ్యగౌడ్, బాల్క సుమన్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, నగేశ్, సీతారాం నాయక్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీహెచ్ మల్లారెడ్డి ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీలు మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో బీసీలు, ఎస్టీల రిజర్వేషన్లు పెంచేందుకు వీలుగా కేంద్రం సానుకూలంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రాలు రిజర్వేషన్లను 50 శాతానికి మించి పెంచాలనుకున్నప్పుడు.. అందుకు దారితీసే పరిస్థితులను బేరీజు వేయాలన్న సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని ప్రస్తావించారు. ఆ దిశగానే బీసీలు, ఎస్టీల రిజర్వేషన్లపై అధ్యయనం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు కమిషన్లను ఏర్పాటు చేశారని చెప్పారు. ఎస్టీల రిజర్వేషన్‌ను 6 శాతం నుంచి 9.08 శాతానికి పెంచవచ్చని ఒక కమిషన్ సిఫారసు చేసిందని, బీసీ–ఈ కేటగిరీకి అదనంగా 6 శాతం రిజర్వేషన్లు కేటాయించవచ్చని మరో కమిషన్ సిఫారసు చేసిందని వివరించారు. తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment