
అహ్మదాబాద్ విమానాశ్రయంలో కుటుంబంతో కెనడా ప్రధాన మంత్రి జస్టిన ట్రుడో
న్యూఢిల్లీ : కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రుడో సోమవారం గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. అయితే, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాత్రం ట్రుడోతో కలసి గుజరాత్‌కు రావడం లేదు. ఎన్నికలు సమీపిస్తున్న కర్ణాటకలో మోదీ పర్యటించనున్నారు. మోదీ ప్రవర్తనపై కెనడా ప్రధానమంత్రి బాధ పడుతున్నారట. ఈ మేరకు కెనడీయన్ మీడియా పెద్ద ఎత్తున కథనాలను ప్రచురించింది.
చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, జపాన్ ప్రధాని షింజో అబే, ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజిమెన్ నెతన్యాహులతో కలసి ప్రధాని మోదీ గతంలో గుజరాత్‌లో పర్యటించారు. ప్రధాని స్థాయి వ్యక్తితో కలసి పర్యటించకుండా.. మోదీ కర్ణాటకలో పర్యటించడంపై కెనడా మీడియా విరుచుకుపడింది. కెనడాలో పెరుగుతున్న సిక్కుల రాడికలిజమ్, ఖలిస్తాన్ దేశ ఏర్పాటుకు మద్దతులపై ఈ ప్రభావం ఉంటుందని భారత్‌ను హెచ్చరించింది.
దీనిపై స్పందించిన భారత అధికారులు.. అతిథ్యానికి విచ్చేసిన ప్రతి ప్రతినిధితో కలసి ప్రధానమంత్రి పర్యటించలేరని చెప్పారు. గత శుక్రవారం హైదరాబాద్‌కు విచ్చేసిన ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీతో కలసి ప్రధాని పర్యటించలేదని వివరించారు. కాగా, గుజరాత్ పర్యటనలో ట్రుడో.. అక్షరధామ్ ఆలయం, సబర్మతీ ఆశ్రమంను సందర్శించనున్నారు. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించేందుకు వచ్చే శుక్రవారం జస్టిన్ ట్రుడోతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశం అవుతారు.