నడిరోడ్డులో యువకుడిని బాదేసిన తృప్తి దేశాయ్
మహిళలకు ప్రవేశం లేదని చెప్పే ఆలయాల్లోకి వెళ్లి.. అక్కడ తాము సైతం పూజలు చేస్తామంటూ ఒక్కసారిగా దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకట్టుకున్న భూమాతా బ్రిగేడ్ నాయకురాలు తృప్తి దేశాయ్ తాజాగా ఓ యువకుడిని నడిరోడ్డులో చితకబాదేసింది. చెప్పులతో కొట్టింది. ఒక మహిళతో సంబంధం పెట్టుకుని ఆమెను పెళ్లి చేసుకోడానికి నిరాకరించినందుకు అతడికి ఈ శిక్ష విధించింది. మహిళా హక్కుల కార్యకర్త అయిన తృప్తి తన సహచరులతో కలిసి శ్రీకాంత్ లోంఢే అనే వ్యక్తిని పుణె-అహ్మద్నగర్ రోడ్డుపై శిర్వాల్ అనే గ్రామం వద్ద నడిరోడ్డులో అందరూ చూస్తుండగా చెప్పులతో కొట్టింది.
ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో సంబంధం పెట్టుకున్నాడని తృప్తి ఆరోపించింది. ఇప్పుడామె గర్భవతి అయ్యిందని.. అబార్షన్ చేయించుకుంటే పెళ్లి చేసుకుంటానని చెప్పి, ఆమె చేయించుకున్న తర్వాత కూడా పెళ్లి చేసుకోలేదని తెలిపింది. అతడు ఇంతకుముందు మరో ఇద్దరు మహిళలను కూడా ఇలాగే మోసం చేశాడని, దాంతో చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవడం తప్ప తనకు వేరే మార్గం ఏమీ కనపడలేదని చెప్పింది.
లోంఢేను తృప్తి దేశాయ్ కొడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా వ్యాపించింది. అయితే.. ఇదంతా పబ్లిసిటీ స్టంటేనని, ఇలా జనాన్ని శిక్షించడం తృప్తి దేశాయ్ మానుకోవాలని కొందరు కామెంట్లు పెట్టారు. సామాజిక కార్యకర్తలమని చెప్పుకొనేవాళ్లు ఇలా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని తమకు ఇష్టం వచ్చినట్లు న్యాయం చెబుతుంటే ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితులకు దారి తీస్తుందని విశ్వంభర్ చౌదరి అనే సామాజిక కార్యకర్త అన్నారు.