
‘కేరళ నిర్భయ’ కేసులో మలుపులు
♦ పోలీసుల అదుపులో నలుగురు అనుమానితులు
♦ కొంతకాలంగా బెదిరింపులు వస్తున్నాయన్న యువతి తల్లి
కొచ్చి: కేరళలో పెరుంబవూర్‌లో 30 ఏళ్ల దళిత మహిళను అత్యాచారం చేసి, హత్యచేసిన కేసులో (నిర్భయ ఘటన తరహా) ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మే 16న కేరళలో జరగనున్న ఎన్నికలకు ముందు ఈ ఘటన సంచలనం రేపుతోంది. సీఎం ఊమెన్ చాందీ ఈ కేసుపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. అయితే అదుపులోకి తీసుకున్న నలుగురు అసలైన నేరస్తులా కాదా అనే అంశంపై స్పష్టత లేద ని పోలీసులు అంటున్నారు. హతమారుస్తామంటూ ఆ యువతికి కొంతకాలంగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆమె తల్లి రాజేశ్వరి తెలిపారు. పలుమార్లు పోలీసులకు ఫిర్యాదుచేసినా, పట్టించుకోలేదన్నారు.
అసలేం జరిగింది?: ఏప్రిల్ 28న ఎర్నాకుళం జిల్లా పెరంబవూర్‌లో లా కాలేజీ విద్యార్థిని అయిన దళిత మహిళను ఆమె ఇంట్లోనే అత్యాచారం చేయటంతోపాటు నిర్భయ ఘటనలాగా పదునైన ఆయుధాలతో దాడిచేసి చంపేశారు. ఆమె పెనుగులాడినట్లు ఆధారాలున్నాయని, మెడ, ఛాతీతోపాటు శరీరంలోని ఇతర భాగాలపై 13 గాయాలున్నాయని పోలీసులు చెప్పారు. దీనిపై కేరళ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చెలరేగింది. ఎస్సీ, ఎస్టీ కమిషన్ సుమొటో కేసును నమోదు చేసి విచారణకోసం సిట్‌ను ఏర్పాటుచేయాలని ఆదేశించగా.. కేరళ మానవ హక్కుల కమిషన్ కేసును క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేయాలని ఆదేశించింది. ఎర్నాకుళంలో హతురాలు చదువుకుంటున్న కాలేజీ విద్యార్థినులు భారీ ర్యాలీ నిర్వహించారు.