ముంబై: ఇథియోపియాలో నిర్బంధానికి గురై విడుదలైన ఇద్దరూ తెలుగువారేనని సమాచారం. ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ అనుబంధ ఐటీఎన్‌ఎల్ కంపెనీ ఇథియోపియాలో చేపట్టిన రోడ్డు పనుల్లో పాల్గొన్న స్థానికులు వేతనాలు అందకపోవడంతో గత నెల 25వ తేదీ నుంచి ఏడుగురు భారతీయ ఉద్యోగులను నిర్బంధించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో భారత దౌత్య కార్యాలయం, విదేశాంగ శాఖ అధికారుల జోక్యంతో భాస్కర్‌రెడ్డి, హరీష్ బండి అనే ఇద్దరిని స్థానికులు రెండు రోజుల క్రితం విడుదల చేశారు.
తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న వీరికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేయించి రాజధాని ఆడిస్‌అబాబాకు తరలించినట్లు భారత దౌత్య కార్యాలయం తెలిపింది. మిగతా వారికి కూడా విముక్తి కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొంది. అక్కడ పనిచేస్తున్న భారత ఉద్యోగులకు జూలై నుంచి, స్థానికులకు రెండు నెలలుగా వేతనాలు అందడం లేదని సమాచారం. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ సంస్థను గట్టెక్కించేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారిని నియమించింది.
Comments
Please login to add a commentAdd a comment