జమ్మూ : పాకిస్థాన్ మళ్లీ మళ్లీ కాల్పులకు తెగబడుతూ తన తెంపరితనాన్ని చాటుకుంటుంది. పాక్ సైన్యం వరుసగా రెండో రోజు సాంబా జిల్లాలోని బీఎస్ఎఫ్ జవాన్ల ఔట్ పోస్ట్లే లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఇద్దరు పౌరులు గాయపడ్డారని పోలీసు ఉన్నతాధికారులు ఆదివారం వెల్లడించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి... చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. గాయపడిన వారు కల్షో దేవి ప్రీతం చంద్గా గుర్తించినట్లు చెప్పారు. గత రాత్రి 9 గంటల ప్రాంతంలో ప్రారంభమైన ఈ కాల్పులు ... ఈ రోజు తెల్లవారుజాము 3.00 గంటల వరకు నిరంతరాయంగా జరుగుతునే ఉన్నాయని తెలిపారు.
అయితే శుక్రవారం జమ్మూ ప్రాంతంలో పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా... పలు పశువులు గాయాలపాలైన సంగతి తెలిసిందే. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు పాక్ సైన్యం సాంబా జిల్లాలోని బీఎస్ఎఫ్ జవాన్ల జౌట్ పోస్ట్లే లక్ష్యంగా కాల్పులు జరిపిన విషయం విదితమే.