
తమిళనాడు: చెన్నై విమానాశ్రమానికి అక్రమంగా తెచ్చిన రెండు కిలోల బంగారు బిస్కెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. షార్జా నుంచి ఆదివారం సాయంత్రం తిరువనంతపురం మార్గంలో చెన్నైకి ఓ విమానం వచ్చింది. అందులో వచ్చిన ప్రయాణికులను అధికారులు క్షుణ్నంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తిరువనంతపురంలోని కోలికోడ్‌కు చెందిన ఇస్రాత్ (33) పట్టుబడ్డాడు. ఆయన ధరించిన షూలను తనిఖీ చేయగా రెండు కిలోల బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. ఆయన వాటిని షూలోని ప్రత్యేక అరలో అమర్చుకుని అక్రమంగా తరలించేందుకు యత్నించాడు. వీటి విలువ రూ.60 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. రెండు కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుని, అతనిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.