క్యాబ్‌ దిగుతావా లేదా దుస్తులు విప్పాలా? | Uber driver Misbehave To woman In Bengaluru | Sakshi
Sakshi News home page

క్యాబ్‌ దిగుతావా లేదా దుస్తులు విప్పాలా?

Published Mon, Aug 5 2019 2:01 PM | Last Updated on Mon, Aug 5 2019 2:11 PM

Uber driver Misbehave To woman In Bengaluru - Sakshi

సాక్షి, బెంగళూరు : ‘హల్లో నువ్వు నా క్యాబ్‌ దిగి నోర్మూసుకొని వెళ్తావా లేదా నీ దుస్తులు విప్పి నడిరోడ్డుపై రచ్చరచ్చ చేయాలా’  అంటూ ఉబర్ క్యాబ్ ఎక్కిన ఓ మహిళని డ్రైవర్ బెదిరింపులకు పాల్పడటమే కాకుండా అర్థరాత్రి నడిరోడ్డుపై ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. క్యాబ్‌ డ్రైవర్‌ బెదిరింపులకు చిగురుటాకులా వణుకుతూ.. బిక్కుబిక్కుమంటూ నడిరోడ్డుపైనే ఆమె అరగంటకు పైగా వేచి ఉన్నారు. అనంతరం మరో క్యాబ్‌ బుక్‌ చేసుకొని ఇంటికి వెళ్లిపోయారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో చోటు చేసుకుంది. బాధితురాలు పేరు అపర్ణ. క్యాబ్‌ ప్రయాణంలో తనకు ఎదురైన ఈ భయానక సంఘటనను సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసుకున్నారు.

ఆమె  ఏమన్నారంటే.. ‘హాల్లో ఫ్రెండ్స్‌ నా జీవితంలో ఎదురైన భయానక ఘటన ఒకటి మీతో పంచుకుంటున్నాను. గత రాత్రి నేను స్నేహితులో కలిసి ఓ పార్టీకి వెళ్లాను. రాత్రి సమయం కావడంతో నా స్నేహితులు ఉబర్‌ క్యాబ్‌ బుక్‌ చేసి నన్ను ఇంటికి పంపిచారు. మార్గమధ్య డ్రైవర్‌ తన స్నేహితుడితో ఫోన్‌ మాట్లాడుతూ.. కస్టమర్లను బూతులు తిట్టాడు. అయినప్పటికీ నేను అతని జోలికి పోలేదు. ఫోన్‌ మాట్లాడిన తర్వాత అతను నావైపు తిరిగి ‘ చూడడానికి చదువుకున్నదానిలా ఉన్నావ్‌..డ్యూటీ అయిపోగానే ఇంటికి వెళ్లొచ్చు కదా? ఎందుకు తాగుతారు. రాత్రి 7గంటలలోపు ఇంటికి వెళ్లక స్నేహితులతో కలిసి ఎందుకు తాగుతారు’  అంటూ నన్ను ప్రశ్నించారు. 

నేను మద్యం సేవించలేదని, నా గురించి అడగాల్సిన అవసరం మీకు లేదన్నాను. దీంతో అతను నాపై విరుచుపడ్డాడు. చెప్పడానికి వీలు కాని మాటలు అన్నాడు. నువ్వు నా కీప్‌గా కూడా పనికి రావు. నా బూట్లు తూడవడానికి కూడా నువ్వు సరిపోవంటూ అసభ్యకర పదజాలంతో  తిట్టడం మొదలెట్టాడు. అతని ప్రవర్తన సరిగా లేకపోవడంతో నేను ఉబర్‌ సేప్టీ బటన్‌ నొక్కాను. ఉబర్‌ కస్టమర్‌ కేర్‌ నాకు ఫోన్‌ చేయకుండా డ్రైవర్‌కు ఫోన్‌ చేశారు. అతను నేను బాగా తాగి ఉన్నానని కస్టమర్‌ కేర్‌కు బదులిచ్చాడు. నేను గట్టిగా అరుస్తూనే ఉన్నాను. నాకు సహాయం చేయాలని కస్టమర్‌ కేర్‌ను కోరాను. అయినప్పటికీ ఎలాంటి సహాయం అందించలేదు. అంతేకాకుండా కస్టమర్‌కేర్‌కు కాల్‌ చేస్తే అది డ్రైవర్‌కు వెళ్తోంది. నేను గట్టిగా అరవడంతో కస్టమర్‌ కేర్‌ నాతో మాట్లాడి క్యాబ్‌ దిగాల్సిందిగా కోరారు.

మరొక క్యాబ్‌ బుక్‌ చేశామని అందులో వెళ్లాల్సిందిగా సూచించారు. దీంతో డ్రైవర్‌ మరింత రెచ్చిపోయాడు. వెంటనే క్యాబ్‌ ఆపేసి ‘ వెంటనే నా కారు దిగి వెళ్లిపో.. లేదంటే ఇక్కడే నీ దుస్తులు విప్పి రచ్చరచ్చ చేస్తా’  అని బెదిరించారు. అప్పుడు రాత్రి 11.15గంటల సమయం అవుతుంది. ఉబర్‌ కస్టమర్‌ చెప్పిన ప్రకారం మరో క్యాబ్‌ రాలేదు. చేసేది ఏమి లేక నా స్నేహితులకు ఫోన్‌ చేసి మరో క్యాబ్‌లో ఇంటికి వెళ్లాను. ఉబర్‌ సంస్థ కస్టమర్లకు ఎంత సెక్యూరిటీని ఇస్తుందో ఈ సంఘటన ద్వారా తెలిసిపోయింది. తర్వాత కూడా ఉబర్‌ నుంచి నాకు ఎలాంటి ఫోన్‌ కాల్‌ రాలేదు. ఒక వేళ నాకు అక్కడ ఏదైనా జరిగిఉంటే ఎలా? ఉబర్‌ సంస్థ తమ కస్టమర్లకు కల్పించే సెక్యూరిటీ ఇదేనా?’  అంటూ అపర్ణ ట్విటర్‌లో ప్రశ్నించారు. అమె ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. చాలా మంది తమకు జరిగిన అనుభవాల్ని పోస్ట్‌ చేస్తున్నారు. ఉబర్‌ క్యాబ్‌ డ్రైవర్లు అరాచకాలకు పాల్పడుతున్నారని, ఎన్ని కేసులు నమోదైనా సంస్థ తగిన చర్యలు తీసుకోవడంలేదని నెటిజన్లు మండిపడుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement