ట్యాక్సీ డ్రైవర్ ఝలక్
నోయిడా: ప్రముఖ ట్యాక్సీ సంస్థ ఊబర్కు చెందిన డ్రైవర్ కస్టమర్కు ఝలక్ ఇచ్చాడు. అతడు డబ్బులు డ్రాచేసుకునేందుకు వెళ్లడం చూసి అతడి ల్యాప్ టాప్తో ఉడాయించాడు. ఏటీఎం నుంచి వెనక్కి వచ్చిన కస్టమర్ అది చూసి అవాక్కయ్యాడు. ఈ ఘటన నోయిడాలో చోటుచేసుకుంది. నోయిడాకు చెందిన హిమాంశు కౌశిక్ అనే వ్యక్తి న్యూ ఫ్రెండ్స్ కాలనీ సెక్టార్ 18 గుండా వెళ్లేందుకు ఊబర్ సంస్థ నుంచి క్యాబ్ ను బుక్ చేసుకున్నాడు.
అది వచ్చిన తర్వాత కారులోకి ఎక్కిన అతడు మధ్యలోకి వెళ్లాక తన స్నేహితుడికి డబ్బులు ఇవ్వాల్సి ఓ ఏటీఎం వద్ద కారు ఆపాడు. అతడు లోపలికి డబ్బు డ్రా చేసుకునేందుకు అలా వెళ్లగానే డ్రైవర్ ఇలా వెళ్లి మోసం చేశాడు. 'నేను ఎన్నోసార్లు ఆ డ్రైవర్కు ఫోన్ చేశాను. కానీ ఎలాంటి స్పందన లేదు. 20 నిమిషాల తర్వాత నా ఫోన్ లిఫ్ట్ చేశాడు. నా బ్యాగ్ గురించి ప్రశ్నించగానే వెంటనే కాల్ కట్ చేశాడు. ఆ తర్వాత మళ్లీ ఎత్తలేదు' అని హిమాంశు ఆందోళన వ్యక్తం చేశాడు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఊబర్ సంస్థకు ఫిర్యాదు చేసినా వారి నుంచి కూడా ఎలాంటి బదులు రాలేదని వాపోయాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.