ముంబై : హిందూ మహాసభ అధ్యక్షుడు, స్వాతంత్ర్య సమరయోధుడు వీర్ సావర్కర్ త్యాగాలను విశ్వసించని వారిని బహిరంగంగా దండించాలని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భరతమాతను బానిస సంకెళ్ల నుంచి విముక్తురాలిని చేసేందుకు సావర్కర్ చేసిన పోరాటాలను తక్కువగా చూసే వారికి ఇదే సరైన శిక్ష అని తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ఆరెస్సెస్‌కు చెందిన విద్యార్థి విభాగం ఏబీవీపీ ఢిల్లీ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో వీర్ సావర్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎన్‌ఎస్‌యూఐ) సావర్కర్ విగ్రహానికి చెప్పుల దండవేసి, ముఖానికి నలుపు రంగు పూసి అవమానించారు. అంతేకాకుండా అదే ప్రాంగణంలో ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్‌ల విగ్రహాలతో పాటు సావర్కర్ విగ్రహం ఉండటాన్ని తాము సహించబోమని ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
ఈ విషయంపై స్పందించిన ఉద్ధవ్ ఠాక్రే శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ‘ స్వాతంత్ర్య ఉద్యమంలో వీర్ సావర్కర్ పోరాటాన్ని, ఆయన చేసిన త్యాగాలను గుర్తించని వాళ్లను బహిరంగంగా చితక్కొట్టాలి. అప్పుడే వాళ్లకు సావర్కర్ విలువ ఏమిటో తెలుస్తుంది. నిజానికి రాహుల్ గాంధీకి కూడా సావర్కర్ గురించి ఏమీ తెలియదు. ఆయన కూడా గతంలో సావర్కర్‌ను తీవ్రంగా అవమానించారు’ అని ఉద్ధవ్ ఠాక్రే ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక ఎన్‌ఎస్‌యూఐ కాంగ్రెస్‌కు చెందిన యూనియన్ అన్న విషయం తెలిసిందే.
సావర్కర్ సేవలు అసమానమైనవి..
ఢిల్లీ విశ్వవిద్యాలయ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కూడా స్పందించారు. ఆయన మాట్లాడుతూ..స్వాతంత్ర్యోద్యమంలో ఎన్నో విప్లవాలకు సావర్కర్ నాంది పలికారన్నారు. దేశ ప్రజలు స్వేచ్చా వాయువులు పీల్చుకోవడంలో ఆయన చేసిన కృషి అసమానమైనదని పేర్కొన్నారు. సావర్కర్‌తో పాటు ఆయన కుటుంబం కూడా దేశ సేవకు అంకితమైందని పేర్కొన్నారు. అలాంటి మహనీయ వ్యక్తిని అవమానించిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఫడ్నవిస్ సూచించారు. భావోద్వేగాలను రెచ్చగొడుతూ శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిని ఉపేక్షించకూడదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment