బ్రెగ్జిట్ తరహాలో ఓటింగ్ పెట్టండి
పెద్దనోట్ల రద్దు మీద బీజేపీ మిత్రపక్షం శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ఓ కొత్త తరహా సూచన చేశారు.
పెద్దనోట్ల రద్దు మీద బీజేపీ మిత్రపక్షం శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ఓ కొత్త తరహా సూచన చేశారు. యూరోపియన్ యూనియన్‌లో ఉండాలా వద్దా అన్న విషయమై బ్రిటన్‌లో నిర్వహించిన 'బ్రెగ్జిట్' పోల్ తరహాలో ఇక్కడ కూడా ఒక రెఫరెండం నిర్వహించాలన్నారు. అలాగే, ప్రముఖ ఆర్థికవేత్త అయిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్లమెంటులో చేసిన సూచనలను కూడా తీసుకోవాలని చెప్పారు. పెద్దనోట్ల రద్దు విధానాన్ని అమలుచేసిన తీరుపై తాను విమర్శనాత్మకంగా స్పందించేందుకు ఏమాత్రం ఆలోచించబోనని ఉద్ధవ్ చెప్పారు. బ్రెగ్జిట్ రెఫరెండం నిర్వహించిన తర్వాత బ్రిటిష్ ప్రధాని రాజీనామా చేశారని, అలాంటి పరిణామం ఇక్కడ కూడా జరుగుతుందా అని ఆయన ప్రశ్నించారు.
125 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన నిర్ణయాన్ని ఒకే ఒక్క వ్యక్తి తీసుకోవడం సరికాదని, 500, 1000 రూపాయల నోట్ల చెల్లుబాటును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకునే ముందు ఆయన కొంతమందినైనా విశ్వాసంలోకి తీసుకుని ఉండాల్సిందని ఠాక్రే అన్నారు. కాగా, పెద్దనోట్ల రద్దుకు నిరసనగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో ఢిల్లీలో జరిగిన ర్యాలీలో శివసేన కూడా పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే.. పార్లమెంటులో మాత్రం ఈ విషయంలో బీజేపీకి దన్నుగా ఉంటామని ఆ పార్టీ ప్రకటించింది.