
సాక్షి, న్యూఢిల్లీ : రెండు వారాలుగా వడగాడ్పులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఉత్తరాది అగ్నిగుండాన్ని తలపిస్తోంది. ఆగ్రా నుంచి తమిళనాడులోని కోయంబత్తూర్‌కు కేరళ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణీకులు ఝాన్సీ వద్ద ఉగ్ర తాపాన్ని భరించలేక మరణించారు. వడదెబ్బతోనే వీరు మరణించారని భారతీయ రైల్వే ప్రతినిధి అజిత్‌కుమార్ సింగ్ మంగళవారం వెల్లడించారు.
కేరళ ఎక్స్‌ప్రెస్‌లో సోమవారం బాధితులు ప్రయాణిస్తున్న రైలు ఝాన్సీకి చేరుకుంటుండగా ప్రయాణీకుల్లో ఒకరు స్పృహ కోల్పోయారని తమకు సమాచారం అందిందని, తాము వైద్య సిబ్బందితో స్టేషన్‌కు చేరుకోగా ముగ్గురు ప్రయాణీకులు అప్పటికే మరణించగా, మరో ప్రయాణీకుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడని చెప్పారు.
కాగా, ఝాన్సీలో ఇటీవల ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయని అధికారులు చెబుతున్నారు. తాము ఆగ్రా దాటిన వెంటనే ఎండ వేడిని భరించలేకపోయామని, కొందరికి శ్వాస సమస్యలు తలెత్తగా మరికొందరు అసౌకర్యంగా ఉందని ఫిర్యాదు చేశారని కొందరు ప్రయాణీకులు చెప్పారు. ఎన్నడూ లేనంత అధిక ఉష్ణోగ్రతలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా రాజస్ధాన్‌లో రికార్డుస్ధాయిలో 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment