ముంబై: మహారాష్ట్రలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్ర భూషణ్ పురస్కార ప్రదానోత్సవంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఖార్‌గఢ్‌లో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు లక్షలాది మంది తరలివచ్చారు. తీవ్రమైన ఎండలో గంటల తరబడి కూర్చున్నారు. ఈ క్రమంలో వడదెబ్బకు గురై 13 మంది ప్రాణాలు కోల్పోయారు.
వివరాల ప్రకారం.. నవీ ముంబయిలో ఆదివారం మహారాష్ట్ర భూషణ్ అవార్డు ప్రదానోత్సవం నిర్వహించగా.. వేలాది మంది సామాజిక కార్యకర్తలు, ఉద్యమకారులు హాజరయ్యారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ వేడుక మధ్యాహ్నం 1 గంట వరకూ కొనసాగింది. మైదానం జనంతో కిక్కిరిసిపోగా.. ఈవెంట్‌ను చూసేందుకు ఆడియో, వీడియో సౌకర్యాలు, కుర్చీలు ఏర్పాటు చేశారు. కానీ, ఎండ నుంచి రక్షణ కల్పించేలా షెడ్లుగానీ, టెంట్లుగానీ వేయలేదు. ఈ క్రమంలో మండుటెండలో గంటల కొద్దీ కూర్చువడంతో సొమ్మసిల్లిపోయారు. ఇక, వీఐపీలు కూర్చునే వేదిక వరకూ మాత్రమే టెంట్లు, షెడ్లు వేశారు.
దీంతో, మిగిలిన వారు వడదెబ్బకు గురై 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో 600 మందికిపైగా జనం అస్వస్థతకు గురయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. మృతుల్లో ఎనిమిది మంది మహిళలు ఉన్నారు. ఈ ఘటన విషయం తెలియడంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నవీ ముంబైకి చేరుకున్నారు. ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని, వడదెబ్బ బాధితుల చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.
ఈ అవార్డుల కార్యక్రమంలో సామాజిక కార్యకర్త దత్తాత్రేయ నారాయణ్ అలియాస్ అప్పాసాహెబ్ ధర్మాధికారికి ఈ అవార్డును ప్రదానం చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రి కపిల్ పాటిల్ తదితరులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment