ఢిల్లీ: రాజ్యాంగపరమైన అనుమానాలుంటే రాష్ట్రపతిని కలుస్తాంటామని ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సీడబ్యూసీ నిర్ణయం తర్వాత సీమాంధ్ర పరిస్థితులను ప్రణబ్ ముఖర్జీకి వివరించామన్నారు. రాజ్యాంగపరంగా ఎమైనా సమస్యలు వచ్చినప్పుడు కూడా రాష్ట్రపతిని కలవడం తెలిసిందే కదా అని ఉండవల్లి వ్యాఖ్యానించారు.
సీమాంధ్రలో ఉద్యమం ఉవ్వెతున ఎగసి పడుతున్న తరుణంలో సీమాంధ్ర నేతల్లో గుబులు రాజుకుంది. యూపీఏ సమన్వయ కమిటీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న అనంతరం సీమాంధ్రలో పరిస్థితుల్లో అకస్మికంగా మార్పు వచ్చింది. దీంతో నేతలకు ఏమి చేయాలో పాలు పోవడం లేదు. ఒకప్రక్క సమైక్యాంధ్రకు అనుకూలమంటూనే.. అధిష్టానం నిర్ణయాన్ని ధిక్కరించలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. పలువురు కాంగ్రెస్ పెద్దలు అధిష్టానాన్ని కలుస్తూ తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు.
టీఆర్‌ఎస్ నాయకులతోపాటు కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా రాష్ట్ర పోలీసుల్లో ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టి హైదరాబాద్‌లో సాయుధ బలగాల తిరుగుబాటును ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తున్నారని సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు పార్టీ అధిష్టానానికి గతంలో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.