ఏ బడ్జెట్లో అయినా అందరినీ ఆకర్షించేది ఆదాయపు పన్నే!!. ఎందుకంటే అంతిమంగా తన జేబులో ఎంత మిగులుతుందన్నదే వేతనజీవి వెదుక్కుంటాడు. అలాంటి వేతనజీవికి... పన్ను రేట్లు తగ్గిస్తున్నామంటూ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన చక్కని విందు భోజనంలా కనిపించింది. ఎంత మమకారమో... అనుకున్నాడు. కానీ... తగ్గింపు రేట్లు కావాలనుకునేవారికి పన్ను మినహాయింపులేవీ ఉండవని ఆమె చెప్పేసరికి.. అన్నం లేకుండా ఆవకాయ వడ్డించినట్లయింది. అమ్మో... కారం!!.
పన్ను రేట్లను తగ్గిస్తున్నట్లు ఒక పక్కన ప్రకటిస్తూనే.. మరో పక్క పన్ను మినహాయింపులను భారీగా తొలగించడం ద్వారా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వేతనజీవుల్ని దొంగ దెబ్బ తీశారు. కొన్ని ఆదాయవర్గాలకు సగానికి సగం పన్ను తగ్గినట్లు చూపించినా.. స్టాండర్డ్ డిడక్షన్, ఇంటి అద్దె అలవెన్స్, చాప్టర్ 6 –ఎ కింద లభించే సెక్షన్ 80–సీ వంటి మినహాయింపులు, ఇంటి రుణంపై చెల్లించే వడ్డీ వంటి కీలక మినహాయింపులను తొలగించారు. శనివారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆర్థికమంత్రి ఆదాయ పన్ను శ్లాబుల్లో భారీ మార్పులను ప్రతిపాదించారు. రూ.15 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి పన్ను రేట్లు తగ్గిస్తూ ప్రస్తుతం ఉన్న నాలుగు శ్లాబుల స్థానంలో ఏడు శ్లాబుల విధానాన్ని ప్రవేశపెట్టారు.
కొత్తగా ప్రవేశపెట్టిన విధానంలో రూ.2.5 లక్షల ఆదాయం వరకు ఎటువంటి పన్ను ఉండదని, రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి గతంలో మాదిరే 5 శాతం పన్ను ఉన్నా దానిపై పూర్తిస్థాయి పన్ను రిబేటు లభిస్తుందని సీతారామన్ తెలిపారు. ఈ కొత్త విధానంలో రిటర్నులు దాఖలు చేసే వారికి... పాత విధానం ప్రకారం వివిధ సెక్షన్ల కింద లభించే మినహాయింపు ప్రయోజనాలు ఉండవని ఆర్థికమంత్రి స్పష్టంచేశారు. అయితే కొత్త విధానానికి మారాలా? లేక పాత విధానంలోనే కొనసాగాలా? అన్నది పన్ను చెల్లింపుదారుల ఇష్టమంటూ... నిర్ణయం తీసుకునే అవకాశాన్ని కూడా వారికే వదిలిపెట్టారు.
ఆదాయపు పన్ను చట్టాన్ని సరళతరం చేసే విధానంలో భాగంగా ప్రస్తుతం ఉన్న సుమారు 100 మినహాయింపుల్లో 70 తొలగించినట్లు మంత్రి ప్రకటించారు. పన్ను రేట్లు తగ్గింపు వల్ల ప్రభుత్వం రూ.40,000 కోట్ల ఆదాయాన్ని నష్టపోతున్నట్లు తెలియజేశారు. ‘‘పన్ను మినహాయంపులు వేటినీ లెక్కించకపోతే రూ.15 లక్షల ఆదాయం ఉన్నవారికి కొత్త పన్ను విధానంలో రూ.78,000 ప్రయోజనం లభిస్తోంది. పాత విధానంలో వారు రూ.2.73 లక్షల పన్ను కట్టాల్సి వస్తే కొత్త విధానంలో రూ.1.95 లక్షలు కడితే సరిపోతుంది’’అని నిర్మల చెప్పారు. కానీ వాస్తవంగా పాత విధానంలో మినహాయింపులను పరిగణనలోకి తీసుకుంటే కొత్త విధానంలో అధిక పన్ను చెల్లించాల్సి వస్తుందని ట్యాక్సేషన్ నిపుణులు స్పష్టం చేస్తుండటం గమనార్హం.
తొలగించిన కొన్ని ముఖ్యమైన మినహాయింపులివే...
వివాద్ సే విశ్వాస్
ఆదాయపు పన్ను చెల్లింపులకు సంబంధించి వివిధ న్యాయస్థానాల్లో ఉన్న లక్షలాది కేసులను పరిష్కరించడానికి ‘వివాద్ సే విశ్వాస్’ పేరుతో ప్రత్యేక ప్రథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఆర్థికమంత్రి ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఆదాయ పన్నుకు సంబంధించి 4.83 లక్షల కేసులు వివాదాల్లో ఉన్నాయని, వీటిని పరిష్కరించుకోవాలనుకునే వారు ఈ పథకం కింద వివాదంలో ఉన్న మొత్తాన్ని చెల్లిస్తే చాలునని స్పష్టంచేశారు. ‘‘మార్చి 31, 2020లోగా చెల్లించేవారికి పెనాల్టీలు, వడ్డీలు వంటివేమీ ఉండవు. అప్పటి నుంచి జూన్ 30, 2020లోగా చెల్లించే వారు మాత్రం కొంత మొత్తాన్ని పెనాల్టీగా చెల్లించాల్సి ఉంటుంది. ఆ తరవాత మాత్రం ఈ పథకం అమల్లో ఉండదు’’అని మంత్రి స్పష్టం చేశారు. గతేడాది బడ్జెట్‌లో పరోక్ష పన్నుల విధానంలో ఉన్న వివాదాలను పరిష్కరించడానికి సబ్‌కా వికాస్ పేరుతో ప్రవేశపెట్టిన పథకం ద్వారా 1.89 లక్షల కేసులు పరిష్కారమయ్యాయని, వీటి ద్వారా రూ.39,000 కోట్ల బకాయిలను వసూలు చేశామని వివరించారు.
ఈ–కామర్స్ లావాదేవీలపై 1% టీడీఎస్
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ లావాదేవీలపై కొత్తగా 1 శాతం టీడీఎస్ (ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్) విధిస్తూ కేంద్రం బడ్జెట్‌లో ప్రతిపాదన చేసింది. దీని ప్రకారం డిజిటల్ ప్లాట్‌ఫాంను నిర్వహించే ఈ–కామర్స్ ఆపరేటరు.. విక్రేతల స్థూల అమ్మకాలకు సంబంధించి 1 శాతం టీడీఎస్ మినహాయించాల్సి ఉంటుంది. అయితే, ఈ–కామర్స్ ప్లాట్‌ఫాంపై అంతక్రితం ఏడాది సదరు విక్రేత అమ్మకాలు రూ. 5 లక్షలకన్నా తక్కువ ఉండటంతో పాటు పాన్ ఆధార్ నంబరు ధృవీకరణ ఉన్న పక్షంలో ఈ నిబంధన వర్తించదు. దీన్ని అధ్యయనం చేస్తున్నట్లు ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ వెల్లడించగా .. ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment