న్యూఢిల్లీ: చిన్నారులపై లైంగిక నేరాలను నిరోధించేందుకు కేంద్రం తెచ్చిన పోక్సో చట్టం–2012 పటిష్టం కానుంది. 18 ఏళ్లలోపు అమ్మాయిలు, అబ్బాయిలపై లైంగికదాడికి పాల్పడేవారికి మరణదండన విధించేలా పోక్సో చట్టానికి చేసిన సవరణలకు కేంద్ర కేబినెట్ శుక్రవారం ఆమోదం తెలిపింది. కేబినెట్ నిర్ణయాలను ఐటీ మంత్రి రవిశంకర్ మీడియాకు చెప్పారు. పోక్సో చట్టంలోని సెక్షన్ 4, 5, 6(18 ఏళ్లలోపువారిపై అత్యాచారానికి పాల్పడేవారికి మరణశిక్ష) సెక్షన్ 9(ప్రకృతి విపత్తుల సమయంలో చిన్నారులపై లైంగికదాడి నుంచి రక్షణ) సెక్షన్ 14, 15(చిన్నారుల అశ్లీలచిత్రాల నియంత్రణ)లను సవరించినట్లు తెలిపారు. ఈ మూడు సవరణలు లైంగికనేరాల నిరోధానికి ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు. చిన్నారుల అశ్లీల చిత్రాలను కలిగిఉన్న వ్యక్తులకు జైలుశిక్ష లేదా జరిమానా లేదా రెండింటిని విధించేలా సెక్షన్ 14, 15ను సవరించారు.
మరికొన్ని కేబినెట్ నిర్ణయాలు..
► దేశంలోని కొబ్బరి రైతులకు కేంద్రం ఊరట కలిగించింది. గుండు కొబ్బరి పంటకు అందిస్తున్న మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.2,170 మేర పెంచుతూ ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ గుండు కొబ్బరి ధర క్వింటాల్‌కు రూ.7,750 ఉండగా, తాజా పెంపుతో అది రూ.9,920కు చేరుకుంది. అలాగే మిల్లింగ్ ఎండు కొబ్బరి క్వింటాల్ ధరను రూ.2,010 పెంచింది. దీంతో దీని మద్దతుధర రూ.9,521కు పెరిగింది.
► ఉల్లి ఎగుమతులపై అందిస్తున్న 5 శాతం ప్రోత్సాహకాలను 10 శాతానికి పెంచాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
► జాతీయ హోమియోపతి కమిషన్ ఏర్పాటుకు ఉద్దేశించిన నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
► సెంట్రల్ కౌన్సిల్ ఫర్ ఇండియన్ మెడిసిన్(సీసీఐఎం) స్థానంలో మరింత పారదర్శకత, జవాబుదారీతనం తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్(ఎన్‌సీఐఎం) ముసాయిదా బిల్లు–2018కి కేబినెట్ ఆమోదముద్ర వేసింది.
కామాంధులకు మరణశిక్షే
Published Sat, Dec 29 2018 2:21 AM | Last Updated on Sat, Dec 29 2018 3:12 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment