న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను ఇంటర్‌నెట్‌లో సామాజిక ప్రచార వేదికల ద్వారా ప్రచారం చేయటానికి సమాచార, ప్రసార మంత్రిత్వశాఖలో కొత్తగా ఒక మీడియా విభాగాన్ని నెలకొల్పాలన్న ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం గురువారం ఆమోదం తెలిపింది. యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విటర్ వంటి సామాజిక వెబ్‌సైట్లలో ప్రచారానికి సంబంధించి సమాచార మంత్రిత్వశాఖ పైలట్ ప్రాతిపదికన చేపట్టిన కార్యక్రమం అనుభవాల ఆధారంగా ఈ న్యూ మీడియా విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ విభాగానికి సంయుక్త కార్యదర్శి హోదాలోని సీనియర్ అధికారి నేతృత్వం వహిస్తారని వెల్లడించింది. ఈ విభాగానికి 2012-17 పన్నెండో పంచవర్ష ప్రణాళికలో రూ. 22.5 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఇందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది.