అరుణాచల్ లో తొలగనున్న రాజకీయ సంక్షోభం
ఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్ లో నెలకొన్న రాజకీయ అనిశ్చితి తొలగిపోయే సూచనలు కన్పిస్తున్నాయి. రాష్ట్రపతి పాలన ఎత్తివేయాలని కేంద్ర కేబినెట్ సిఫారసు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ సంక్షోభం నేపథ్యంలో అరుణాచల్‌ప్రదేశ్‌లో గతనెల రాష్ట్రపతి పాలన విధించారు. కేబినెట్ ప్రతిపాదనకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే రాష్ట్రపతి పాలన ముగుస్తుంది.
రాష్ట్రపతి పాలన అమలులో ఉన్న అరుణాచల్ ప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించకుండా గవర్నర్ జేపీ రాజ్‌ఖోవాకు మధ్యంతర ఆదేశాలివ్వాలంటూ కాంగ్రెస్ రాష్ట్ర నేతలు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు నేడు తోసిపుచ్చింది. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని కాంగ్రెస్ అసమ్మతి నేత కాలిఖొ పాల్ ప్రకటించారు.
కాంగ్రెస్ పాలనలో ఉన్న అరుణాచల్‌లో సీఎం నబమ్ టుకీపై అసంతృప్తితో 21మంది ఎమ్మెల్యేలు డిసెంబర్ 16న తిరుగుబాటు చేశారు. 11 మంది ఎమ్మెల్యేలున్న బీజేపీ.. కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంది. గతేడాది డిసెంబర్ 16, 17 తేదీల్లో రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు హోటల్లో జరిగాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలోని అసమ్మతి ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. 60 మంది ఎమ్మెల్యేలు గల ఆ రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 47 సీట్లు ఉన్నాయి. అయితే ముఖ్యమంత్రి నబమ్ టుకీకి కేవలం 26 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మద్దతు ఇస్తున్నారు.