కేంద్రమంత్రి అనిల్ మాధవ్ దవే హఠాన్మరణం
న్యూఢిల్లీ: కేంద్ర పర్యావరణ, అటవీశాఖమంత్రి అనిల్ మాధవ్ దవే (61) గురువారం ఉదయం ఆకస్మికంగా కన్నుమూశారు. ఆయన హఠాన్మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దవే మృతి వ్యక్తిగతంగా తనకు తీవ్ర నష్టమని, నిన్న సాయంత్రం వరకూ ఆయన తనతో కీలక విధానాలు చర్చించినట్లు నరేంద్ర మోదీ తెలిపారు.
దవే ఈ ఏడాది జనవరిలో నిమోనియాతో తీవ్రంగా బాధపడ్డారు. అప్పటినుంచి ఆయన ఆరోగ్యంలో మార్పులు వచ్చాయి. గురువారం ఉదయం ఒంట్లో నలతగా ఉందని ఇంట్లో చెప్పడంతో ఆయనను కుటుంబసభ్యులు ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు దవే. 1956లో జూలై 6న మధ్యప్రదేశ్‌లోని బాద్‌నగర్‌లో దవే జన్మించారు. గుజరాతీ కళాశాల నుంచి ఎం.కామ్ పట్టాను పొందారు.
ఆ తర్వాత ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరిన దవే.. నర్మదా నది సంరక్షణ కోసం పోరాడారు. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. గతేడాది జరిగిన మంత్రివర్గ విస్తరణలో ప్రధానమంత్రి మోదీ.. దవేకు పర్యావరణ, అటవీ శాఖ బాధ్యతలను అప్పజెప్పారు. దవేకు పర్యావరణ శాఖను అప్పజెప్పడం చాలామందని ఆశ్చర్యానికి గురి చేసింది. బుధవారం చాలా సమయం ఆయన సమావేశాలతో గడిపారు. ఆ తర్వాత పాలసీల గురించి ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సాయంత్రం భేటీ అయ్యి చర్చించారు. దవే హఠాన్మరణంపై పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు సంతాపం తెలిపారు.