Anil Madhav Dave
-
ఇద్దరు భారతీయులకు ఓజోన్ అవార్డు
న్యూఢిల్లీ: కేంద్ర పర్యావరణశాఖ మాజీ మంత్రి అనిల్ దవే, సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్(సీఎస్ఈ) డిప్యూటీ డైరెక్టర్ చంద్ర భూషణ్‌లు ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమంలో భాగంగా అందించే ఓజోన్ అవార్డులు అందుకున్నారు. రువాండాలో గత ఏడాది కిగాలీ ఒప్పందం కుదరడంలో దవే చొరవకు గుర్తింపుగా ఆయనకు మరణానంతరం ‘రాజకీయ నాయకత్వ అవార్డు’ను ప్రకటించారు. దవే తరఫున భారత పర్యావరణ, అటవీ శాఖ కార్యదర్శి అవార్డు స్వీకరించారు. కిగాలీ ఒప్పందంలో కీలకంగా వ్యవహరించినందుకు చంద్రభూషణ్‌కు భాగస్వామ్య అవార్డు లభించింది. -
కేంద్రమంత్రి అనిల్ మాధవ్ దవే హఠాన్మరణం
న్యూఢిల్లీ: కేంద్ర పర్యావరణ, అటవీశాఖమంత్రి అనిల్ మాధవ్ దవే (61) గురువారం ఉదయం ఆకస్మికంగా కన్నుమూశారు. ఆయన హఠాన్మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దవే మృతి వ్యక్తిగతంగా తనకు తీవ్ర నష్టమని, నిన్న సాయంత్రం వరకూ ఆయన తనతో కీలక విధానాలు చర్చించినట్లు నరేంద్ర మోదీ తెలిపారు. దవే ఈ ఏడాది జనవరిలో నిమోనియాతో తీవ్రంగా బాధపడ్డారు. అప్పటినుంచి ఆయన ఆరోగ్యంలో మార్పులు వచ్చాయి. గురువారం ఉదయం ఒంట్లో నలతగా ఉందని ఇంట్లో చెప్పడంతో ఆయనను కుటుంబసభ్యులు ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు దవే. 1956లో జూలై 6న మధ్యప్రదేశ్‌లోని బాద్‌నగర్‌లో దవే జన్మించారు. గుజరాతీ కళాశాల నుంచి ఎం.కామ్ పట్టాను పొందారు. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్లో చేరిన దవే.. నర్మదా నది సంరక్షణ కోసం పోరాడారు. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. గతేడాది జరిగిన మంత్రివర్గ విస్తరణలో ప్రధానమంత్రి మోదీ.. దవేకు పర్యావరణ, అటవీ శాఖ బాధ్యతలను అప్పజెప్పారు. దవేకు పర్యావరణ శాఖను అప్పజెప్పడం చాలామందని ఆశ్చర్యానికి గురి చేసింది. బుధవారం చాలా సమయం ఆయన సమావేశాలతో గడిపారు. ఆ తర్వాత పాలసీల గురించి ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సాయంత్రం భేటీ అయ్యి చర్చించారు. దవే హఠాన్మరణంపై పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు సంతాపం తెలిపారు. -
ఏసీ 24 డిగ్రీల్లో ఉంటే విద్యుత్ ఆదా!
న్యూఢిల్లీ: ఇంధనాన్ని ఆదా చేసేందుకు ఎయిర్ కండిషనర్ (ఏసీ)లను నిర్ణీత ఉష్ణోగ్రతల స్థాయిలోనే ఉపయోగించేందుకు కేంద్రం ముసాయిదా బిల్లును రూపొందించింది. ‘భవనాలు, వాణిజ్య సముదాయాలు, విమానాశ్రయాల్లో ముందుగా నిర్ణయించిన ఉష్ణోగ్రత వద్దనే ఏసీలు పనిచేసేలా నిబంధనలు తెచ్చే ప్రతిపాదనలు ఉన్నాయా?’అని ఓ సభ్యుడు ప్రశ్న అడిగారు. దీనికి పర్యావరణ మంత్రి అనిల్ మాధవ్ దవే రాజ్యసభలో సమాధానమిచ్చారు. ఏసీలను వేసవిలో 28 డిగ్రీ సెల్సియస్ వద్ద ఉంచుకోవాలని జపాన్ ప్రభుత్వం 2005లోనే ఆ దేశ ప్రజలను, వ్యాపారస్తులను కోరిందనీ, దీనివల్ల విద్యుత్తు వినియోగం తగ్గుతుందని తెలిపారు. ప్రస్తుతం మన దేశంలో ఏసీలను 20 డిగ్రీ సెల్సియస్ లేదా అంతకన్నా తక్కువకు వినియోగిస్తున్నారనీ, దీనిని 24 డిగ్రీలకు పెంచితే విద్యుత్తును ఆదా చేయవచ్చన్నారు.