కరువుపై అధ్యయనానికి బృందాలు
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు కేంద్రం హామీ
ప్రధాని, పలువురుకేంద్ర మంత్రులతో సీఎం భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేసిన విజ్ఞప్తి మేరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కరువు పరిస్థితులను అధ్యయనం చేయడానికి త్వరలోనే బృందాలను పంపుతామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. రెండు రోజుల పర్యటన కోసం సోమవారం ఉదయం ఢిల్లీ వచ్చిన చంద్రబాబునాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. బాబు వెంట కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, పార్టీ పార్లమెంటరీ నేత సుజనా చౌదరి, ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు, ఎంపీలు అవంతి శ్రీనివాసరావు, గుండు సుధారాణి తదితరులు ఉన్నారు. బాబు పర్యటన వివరాలను సుజనాచౌదరి, సుధారాణి సోమవారం రాత్రి ఏపీ భవన్‌లో విలేకరులకు వెల్లడించారు. సాయంత్రం 4 గంటలకు చంద్రబాబు ప్రధాని నరేంద్రమోడీని ఆయన నివాసంలో కలిశారు. విభజన వల్ల రాష్ట్రానికి అన్యాయం జరిగిందని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఇతర సమస్యలను వివరించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను త్వరగా ఇవ్వాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు వేగంగా పూర్తయ్యేలా నిధుల కేటాయింపులు పెంచాలని కోరారు. రాజధాని ప్యాకేజీ త్వరగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వీటికి అవసరమైన ప్రతిపాదనలు పంపాలని బాబుకు ప్రధాని సూచించారు. రాజధాని, ఇతర అభివృద్ధి అంశాలను ప్రధాని తెలుసుకున్నారు.
తొలుత సోమవారం ఉదయం ఎయిర్‌పోర్టులో కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్‌సింగ్‌తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కరువు పరిస్థితులను వివరించారు. తక్షణ సాయం కోసం అధికారుల బృందాలను పంపాలని కోరారు. ఇందుకు వ్యవసాయ మంత్రి సానుకూలంగా స్పందించారు. త్వరలోనే అధ్యయన బృందాలను పంపుతామని చెప్పారు. మధ్యాహ్నం వాణిజ్య మంత్రి నిర్మలాసీతారామన్‌ను కలిసి వైజాగ్ - చెన్నై పారిశ్రామిక కారిడార్, పన్ను రాయితీలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీలు, బడ్జెట్‌లో పెట్టిన ప్రతిపాదనలను సమీక్షించారు. వీటిని నెరవేర్చేందుకు లక్ష్యాలు, సాధనతో కూడిన రోడ్ మ్యాప్‌ను రూపొందించారు. అనంతరం పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను కలిశారు. కాకినాడ ఎల్‌ఎన్‌జీ టెర్మినల్‌ను త్వరితగతిన పూర్తిచేయాలని కోరారు. మూడేళ్లలోగా రాష్ట్రంలో నగరాల్లో ప్రతి ఇంటికీ పైప్‌డ్ నేచురల్ గ్యాస్, పల్లెల్లో ఎల్పీజీ కనెక్షన్లు అందుబాటులోకి వచ్చేలా చూడాలని కోరారు. దీనికి సంబంధించి మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామని పెట్రోలియం మంత్రి హామీ ఇచ్చినట్టు సుజనా చౌదరి తెలిపారు. రాష్ట్రంలో పెట్రో ప్రాజెక్టులను జాయింట్ వెంచర్‌గా చేద్దామని, రాష్ట్రం భాగస్వామ్యం ఉండాలని కేంద్ర మంత్రి సూచించారు. తరువాత ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి హర్‌సిమ్రత్ కౌర్‌తో చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఆహారోత్పత్తుల పరిశ్రమలకు చాలా అవకాశం ఉందని, అయితే కేంద్రం దీనిని జనంలోకి తీసుకెళ్లలేదని వివరించారు. ఫుడ్ ప్రాసెస్ క్లస్టర్లు, పార్కుల ఏర్పాటు ఊపందుకోలేదని వివరించారు. ఫుడ్ పార్కులకు సంబంధించి ఏపీ నుంచి 70 దరఖాస్తులు వచ్చాయని, త్వరలోనే వీటిపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి తెలిపారు.
పన్ను రాయితీలపై లోతుగా చర్చించాలి
రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పన్ను రాయితీల పరిస్థితి ఏమిటని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘పన్ను రాయితీలపై మరింత లోతుగా చర్చించాల్సి ఉంది. కేంద్ర వాణిజ్య మంత్రితో మరో రోజు సమావేశమవుతాం. రాష్ట్ర అధికారులు కూడా ఈ సమావేశానికి వస్తారు’’ అని సుజనా చౌదరి చెప్పారు. ప్రత్యేక హోదాపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. ఏపీ, తెలంగాణకు పన్ను రాయితీ ఇవ్వడంవల్ల పక్క రాష్ర్టమైన తమపై ప్రభావం చూపుతుందని, తమకు కూడా ఇవ్వాలన్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత డిమాండ్‌పై ప్రశ్నించగా.. ‘అది గత ప్రధానమంత్రి రాజ్యసభలో ఇచ్చిన హామీ’ అని అన్నారు. అందరి అభిప్రాయాలు తీసుకునే రాజధానిపై ప్రకటన ఉంటుందని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రుణాల రీషెడ్యూలుకు ఆర్బీఐ ఆమోదం తెలుపుతుంద ని ఆశాభావం వ్యక్తంచేశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం కరువు పరిస్థితిని సకాలంలో నివేదించకపోవడంవల్లే ఈ సమస్య ఉత్పన్నమైందని అన్నారు. బ్యాంకులు నష్టపోవాలని తాము అనడంలేదని, తాత్కాలికంగా రీషెడ్యూలు మాత్రమే అడిగామని, నిరాకరించే అవకాశం లేదని చెప్పారు. రెవెన్యూ లోటుపై మాట్లాడుతూ.. లోటు బడ్జెట్‌కు దీనికి సంబంధం లేదని తెలిపారు. రెవెన్యూ లోటును కేంద్రం పూడుస్తుందన్న ఆశాభావం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం మరికొందరు కేంద్ర మంత్రులను కలుస్తారని చెప్పారు.
హైదరాబాద్ ప్రధాన ఆర్కిటెక్ట్ నేనే
ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు
సాక్షి, న్యూఢిల్లీ : హైదరాబాద్‌కు ప్రధాన ఆర్కిటెక్ట్ తానేనని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. హైదరాబాద్‌లో వేల కోట్ల సంపదను తానే సృష్టించానని తెలిపారు. సోమవారం సాయంత్రం ఇక్కడి విదేశీ మీడియా ప్రతినిధుల క్లబ్‌లో జరిగిన చర్చాగోష్టిలో ఆయన మాట్లాడారు. ‘‘సంపదను సృష్టించగలిగితే అది పేదలకు, ప్రజలకు చేరుతుం దని ఆలోచించాను. పలు విద్యాసంస్థలు స్థాపించాను. ఐటీ ఆధారంగా రూ. 65 వేల కోట్ల సంపద సృష్టించాను. హైదరాబాద్‌లాంటి నగర నిర్మాణానికి 20 నుంచి 30 ఏళ్లు పడుతుంది. రూ. 4 లక్షల కోట్ల నుంచి రూ. 5 లక్షల కోట్ల నిధులు అవసరం. నేను హైదరాబాద్ బ్రాండ్‌ను సృష్టించాను. ఆ ఇమేజ్ పాడు కాకూడదని కోరుకుంటున్నాను. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను నాశనం చేస్తే తెలంగాణ మనుగడ సాధించలేదు. నగరాలు నిర్మించే సత్తా మాకుంది. ఏపీలో విస్తారమైన అవకాశాలున్నాయి. ప్రధాని, నేను ఒకే ఆలోచనతో ముందుకుపోతున్నాం. మా ఇద్దరికీ అభివృద్ధే ప్రధానం. పోర్టులు, విమానాశ్రయాలతో ఏపీ ఒక లాజిస్టిక్ హబ్‌గా ఎదగాలన్నది మా కోరిక. కేంద్రం పన్ను రాయితీలు ఇస్తానంది. ఏపీలో కొత్తగా రాజధాని, పోర్టులు, పరిశ్రమలు రానున్నాయి. టూరిజం అభివృద్ధికి ఆస్కారం ఉంది’’ అని చెప్పారు.